Nissan : ప్రముఖ జపాన్ వాహన తయారీ సంస్థ నిస్సాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. గ్లోబల్‌గా కార్ల విక్రయాలు తగ్గిన నేపథ్యంలో కంపెనీ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో తమ వ్యయాలను తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో సుమారు 20,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు సమాచారం. ఇది కంపెనీలో మొత్తం ఉద్యోగులలో దాదాపు 15 శాతంకు సమానం. గతేడాది నవంబర్‌లో అమెరికా, చైనా మార్కెట్లలో అమ్మకాలు పతనమైన కారణంగా నిస్సాన్ లాభాలు 94 శాతం తగ్గిపోయిన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లోనే సంస్థ 9,000 మంది ఉద్యోగులను తొలగించగా, తాజా వార్తల ప్రకారం ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని జపాన్ జాతీయ ప్రసార సంస్థ ఎన్‌హెచ్‌కే నివేదించింది.
Read Also: DGMO : ముగిసిన భారత్- పాకిస్థాన్ డీజీఎంవోల చర్చలు
నిస్సాన్ ఇటీవల ప్రకటించిన వివరాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు 700-750 బిలియన్ యెన్ నికర నష్టం వచ్చేందుకు అవకాశం ఉందని అంచనా. దీనివల్ల కంపెనీ వ్యూహాత్మకంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా, జపాన్‌లోని అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ అవకాశాలు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇది జరిగితే, గత 18 ఏళ్లలో నిస్సాన్ ప్రవేశపెట్టిన తొలి ముందస్తు పదవీ విరమణ ప్రణాళిక ఇదే కానుంది. సంస్థ ఈ విషయంపై ఇంకా అధికారికంగా స్పందించనప్పటికీ, మే 13న విడుదలయ్యే వార్షిక ఆర్థిక ఫలితాల్లో దీనిపై స్పష్టత రావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమ తీవ్రమైన మార్పులను ఎదుర్కొంటున్న తరుణంలో నిస్సాన్ నిర్ణయాలు ఉద్యోగుల భవితవ్యంపై గణనీయ ప్రభావం చూపనున్నాయి.
Read Also: Kohli Retirement Post: విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ పోస్ట్‌లో ఏం రాశాడో తెలుసా?