Tahawwur Rana : 26/11 ముంబై దాడులకేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్ హుస్సేన్ రాణా ఎన్‌ఐఏ కస్టడీని సోమవారం ఢిల్లీ కోర్టు పొడిగించింది. దీంతో అతడు మరో 12 రోజులు దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉండనున్నాడు. ఎన్‌ఐఏ అదుపులో ఉన్న రాణాను ఇటీవల ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించారు. ఈ విచారణకు అతడు సహకరించకుండా.. తప్పించుకునే రీతిలో సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ముంబయి ఉగ్రదాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో భాగంగా రాణా వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఇక, ఇదివరకు విధించిన 18 రోజుల కస్టడీ గడువు ముగియడంతో ఈ రోజు రాణాను కోర్టుముందు హాజరుపర్చారు. అతడి ముఖం కనిపించకుండా కవర్ చేసి, కట్టుదిట్టమైన భద్రత నడుమ న్యాయస్థానానికి తీసుకువచ్చారు. తహవ్వుర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై 2009లో అరెస్టయ్యాడు. అమెరికా జైల్లో శిక్ష అనుభవించిన అతడిని అప్పగింత ప్రక్రియలో భాగంగా భారత్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
కాగా, 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న సముద్ర మార్గం ద్వారా ముంబయికి చేరుకుని.. సీఎస్‌ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 18 మంది భద్రత సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌లు అమరులయ్యారు. ఈ దాడులు నవంబర్ 29 వరకు కొనసాగింది.
తహవ్వూర్ రాణాను భారతదేశానికి తరలించేందుకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అమెరికా సుప్రీం కోర్టు 2023లో ఆయనను భారతదేశానికి అప్పగించేందుకు అనుమతిచ్చింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. తహవ్వూర్ రాణా ఎన్ఐఏ కస్టడీలోకి అప్పగించబడటం, 26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో న్యాయవ్యవస్థకు కీలక మలుపు. రాణా నుంచి పొందే సమాచారం, ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అరికట్టడంలో సహాయపడే అవకాశం ఉంది.
Read Also : Terrorists Hunt : నలుగురు ఉగ్రవాదుల వేట.. లొకేషన్‌పై కీలక అప్‌డేట్