Site icon HashtagU Telugu

New Parliament Photos : కొత్త పార్లమెంట్ అదుర్స్.. ఓ లుక్కేయండి

New Parliament

New Parliament

New Parliament Photos : మన దేశానికి కొత్త పార్లమెంటు బిల్డింగ్ అందుబాటులోకి రాబోతోంది. ఆ ప్రజాస్వామ్య సౌధాన్ని ఈనెల 28న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దాదాపు రూ.862 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన కొత్త పార్లమెంటు బిల్డింగ్ కు సంబంధించిన ఆసక్తికర విశేషాలను తెలుసుకుందాం.. 

New Parliament7

పార్లమెంటు కొత్త భవనాన్ని  త్రిభుజాకృతిలో నిర్మించారు. సెంట్రల్‌ విస్టా రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా కొత్త భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ కేవలం రెండున్నరేళ్లలో నిర్మించింది. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ బిమల్‌ పటేల్‌ నేతృత్వంలో ఈ  నిర్మాణం సాగింది.

ప్రస్తుత పార్లమెంటు పక్కనే .. కొత్త పార్లమెంటు భవనం కట్టారు. ఇందులో పెద్ద హాళ్లు, కమిటీ రూములు, సెంట్రల్‌ హాలు, అతి పెద్ద లైబ్రరీ, విశాలమైన పార్కింగ్‌ వంటి సదుపాయాలన్నీ ఉన్నాయి.

కొత్త పార్లమెంటు భవనంలోని  లోక్‌సభ హాలును జాతీయ పక్షి నెమలి థీమ్‌తో నిర్మించారు. ఇందులో 888 మంది సభ్యులు కూర్చోవచ్చు. సభ్యుల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా ప్రస్తుత లోక్‌సభ హాలు కంటే మూడు రెట్లు పెద్దగా కట్టారు. పార్లమెంటు సంయుక్త సమావేశాలకు కూడా సరిపోతుంది. 1,272 మంది సందర్శకులు సమావేశాలను ఏకకాలంలో వీక్షించే సౌకర్యం ఉంది. 

కొత్త పార్లమెంటు భవనంలోని  రాజ్యసభ హాలును జాతీయ పుష్పం తామర థీమ్‌తో నిర్మించారు. 384 మంది సభ్యులు కూర్చునేలా సీటింగ్‌ ఏర్పాట్లున్నాయి. పార్లమెంటు భవన మూడు ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మ ద్వారాలని పేర్లు పెట్టారు. వీఐపీలు, ఎంపీలు, సందర్శకులకు మరో మూడు ప్రవేశ ద్వారాలున్నాయి.

also read : New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంపై రాజకీయ రగడ

150 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా కొత్త పార్లమెంటు భవనాన్నీ డిజైన్‌ చేశారు.  రాజస్తాన్‌కు చెందిన ధోల్‌పూర్‌ రాళ్లతో భవనానికి అద్భుతమైన లుక్‌ వచ్చింది. పార్లమెంటు భవనంలోని ఇంటీరియర్స్‌ భారత సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా, భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తుకు తెచ్చేలా పలు ప్రాంతీయ కళారూపాలతో రూపొందాయి.

కొత్త పార్లమెంటు భవనంలో గ్రీన్‌ ఎనర్జీతో 30% దాకా విద్యుత్‌ ఆదా అవుతుంది. భవన నిర్వహణ ఖర్చులో ఏడాదికి రూ.1,000 కోట్లకు పైగా ఆదా అవుతుందట. పార్లమెంటు భవనం పైకప్పు మీద కాంస్యంతో తయారు చేసిన మన జాతీయ చిహ్నం నాలుగు సింహాలను ఏర్పాటు చేశారు. ఇది 9,500 కిలోల బరువుతో 6.5 మీటర్ల ఎత్తుంది.

ప్రస్తుత పార్లమెంటు భవనం బ్రిటిష్‌ కాలం నాటిది. న్యూఢిల్లీ నగర రూపకర్తలైన ఎడ్విన్‌ ల్యూటెన్స్, హెర్బర్ట్‌ బేకర్‌ దీన్ని డిజైన్‌ చేశారు. 1921 నుంచి ఆరేళ్ల పాటు భవన నిర్మాణం సాగింది. ఈ వృత్తాకార భవనానికి 83 లక్షలు ఖర్చు అయింది. 1927 జనవరి 18న గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌ దీన్ని ప్రారంభించారు. పాత పార్లమెంటు భవనాన్ని మ్యూజియంగా మార్చనున్నారు.