Coaching Centres: దేశ రాజధాని ఢిల్లీలోని రాజేంద్రనగర్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో వరద నీరు రావడంతో ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టాల(New laws)ను రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వం(Delhi Govt) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అతిశి పేర్కొన్నారు. ఈ కమిటీలో అధికారులతో పాటు విద్యార్థులు సైతం భాగస్వాములవుతారని తెలిపారు. అన్ని రకాల కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు దీని పరిధిలోకి వస్తాయని తెలిపారు. మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల అర్హతలు, ఫీజుల నియంత్రణ, తప్పుదోవ పట్టించే ప్రకటనలను చట్టం ద్వారా అరికట్టనున్నట్లు తెలిపారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
చట్టాలను ఉల్లంఘిస్తూ బేస్‌మెంట్లను కోచింగ్ సెంటర్లుగా ఉపయోగిస్తున్న వారిపై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. రాజేంద్రనగర్, ముఖర్జీనగర్, లక్ష్మీనగర్, ప్రీతి విహార్‌లోని 30 కోచింగ్ సెంటర్ల బేస్‌మెంట్‌లను సీజ్ చేశామన్నారు. మరో 200 కోచింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. రాజేంద్రనగర్ ఘటనలో అధికారులు దోషులుగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా , కోచింగ్ సెంటర్ వద్ద సివిల్స్ విద్యార్థులంతా నిరవధిక దీక్షలు ప్రారంభించారు. బాధిత కుటుంబాలకు రూ.5 కోట్లు చొప్పున పరిహారంతో పాటు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ఘటనకు కారకులైన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.