Nasa : నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం మళ్లీ వాయిదా.. కారణం అదేనని వెల్లడి

నాసాకు మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రుడిపైకి వ్యోమ‌గాముల‌ను పంపేందుకు ఉద్దేశించిన ఆర్టెమిస్‌-1 ప్రయోగం మరోసారి వాయిదా పడింది.

  • Written By:
  • Publish Date - September 4, 2022 / 04:30 PM IST

నాసాకు మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రుడిపైకి వ్యోమ‌గాముల‌ను పంపేందుకు ఉద్దేశించిన ఆర్టెమిస్‌-1 ప్రయోగం మరోసారి వాయిదా పడింది. రాకెట్‌లో ఇంధన లీకేజీని అరికట్టడంలో ప్రయత్నాలు సఫలం కాకపోవడం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నాసా ప్రకటించింది.లాంఛ్ సిస్టమ్ రాకెట్​లో ఇంధనం లీక్ అయినట్లు గుర్తించారు. సూపర్ కోల్డ్ హైడ్రోజన్, ఆక్సిజన్ లీక్ అవ్వడం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. రిహార్సల్స్​ నిర్వహించగా ఆ సమయంలోనే ఇంధన లీకేజీ జరిగినట్లు తేల్చారు. దీంతో.. వాల్వ్​లోనూ లీకేజీలు వచ్చాయి. నాలుగు ప్రధాన ఇంజిన్లు, పెద్ద ఇంధన ట్యాంకు ఉన్న ప్రాంతంలో పగుళ్లు..లీకులు ఉండటంతో చివరి నిమిషంలో ప్రయోగం వాయిదా వేసినట్లు సమాచారం. తిరిగి ఈ ప్ర‌యోగాన్ని ఎప్పుడు చేప‌ట్ట‌నున్నదీ మాత్రం నాసా వెల్ల‌డించాల్సి ఉంది. ఈ ప్ర‌యోగం ఇప్ప‌టికే గ‌త నెల 29న వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇంజిన్‌ నంబర్‌-3లో లీకేజీ సమస్య వల్ల రాకెట్‌ లాంఛ్‌ను అప్పట్లో వాయిదా వేశారు.

అపోలో ప్రాజెక్టు తర్వాత..

అపోలో ప్రాజెక్టు తర్వాత 50 ఏళ్లకు మరోసారి చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు నాసా ప్రతిష్ఠాత్మకంగా ఆర్టెమిస్‌ ప్రాజెక్టును చేపట్టింది. చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపించడమే ఈ 100 మీటర్ల ఆర్టెమిస్ ఉద్దేశ్యం. 1972లో ప్రాజెక్ట్ అపోలో ముగిసిన తర్వాత ఈ ప్రయత్నం జరగలేదు. ఆర్టెమిస్-1 కేవలం సాంకేతిక ప్రయోగం మాత్రమే. ఈ స్పేస్ క్యాప్సూల్‌లో మనుషులు ప్రయాణించరు. కానీ అన్నీ ఊహించినట్లుగా జరిగితే 2024లో ప్రయోగించనున్న ఆర్టెమిస్-2 చంద్రుని పైకి కచ్చితంగా వ్యోమగాములను తీసుకుని వెళుతుంది. కాగా ఆర్టెమిస్ ప్రయోగం పట్ల ప్రతిఒక్కరూ సహనం వహించాలని, ఒకవేళ ఈ ప్రయోగం మరింత వాయిదా పడినా కూడా ఆశ్చర్యపోవద్దని నాసా వ్యోమగామి జెస్సికా మైయర్ చెప్పారు