Landing on Moon: చంద్రుడిపై ఆ 13 ప్రాంతాల్లో మనుషులు దిగొచ్చని గుర్తించిన నాసా!!

చంద్రుడిపై మనుషులు అడుగుపెట్టే రోజు మరెంతో దూరంలో లేదు. ఈ దిశగా అంతరిక్ష పరిశోధనా సంస్థలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - August 22, 2022 / 09:10 AM IST

చంద్రుడిపై మనుషులు అడుగుపెట్టే రోజు మరెంతో దూరంలో లేదు. ఈ దిశగా అంతరిక్ష పరిశోధనా సంస్థలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అందరి కంటే ఒక అడుగు ముందుకు వేసింది. భవిష్యత్ లో మనుషులను చంద్రుడిపైకి పంపితే .. వాళ్లను ఎక్కడెక్కడ దించాలి ? అనేది గుర్తించింది.

వ్యోమగాములను దించేందుకు అనువైనవిగా భావిస్తున్న 13 ప్రాంతాలను గుర్తించింది.త్వరలోనే ఆర్టిమిస్ III మిషన్ ద్వారా మరోసారి మనుషులను చంద్రుడిపైకి పంపే యోచనలో నాసా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసేందుకు చందమామ దక్షిణ ధ్రువం సమీపంలో 13 ప్రాంతాలను గుర్తించింది. చంద్రుడిపై ఆర్టిమిస్ నౌక 6.5 రోజులు ఉంటుంది. ఈ సమయం మొత్తం పగలు ఉండేలా ఈ ప్రాంతాలను గుర్తించారు. చంద్రుడిపై చీకటి చాలా గాఢంగా ఉంటుంది. దానిలో ఏమి ఉన్నా మనకు కనిపించదు. అందుకే సూర్యకాంతి ప్రతినిమిషం ఉండే ప్రాంతాలను నాసా గుర్తించింది.

ఎక్కడ ల్యాండవ్వాలనేది..

అంతరిక్ష పరిశోధనల్లో ఇప్పటికీ అత్యుత్తమంగా చెప్పుకునేది చంద్రుడిపై మానవులు అడుగు పెట్టడం గురించే. అమెరిక అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ మిషన్‌ను విజయవంతంగా ముగించిన తర్వాత.. చాలా దేశాలు మానవులను చంద్రుడిపై సొంతంగా పంపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

ఈ క్రమంలో ముందుగా మానవ రహిత స్పేస్ క్రాఫ్ట్‌లను పంపుతున్నాయి. భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను పంపితే ఎక్కడ ల్యాండవ్వాలనేది కూడా సమస్యగానే మారింది. దీనికి నాసా తాజాగా సమాధానం చెప్పింది. దీనికోసం చందమామపై మొత్తం 13 ప్రాంతాలను గుర్తించింది.