Kamal Haasan : ప్రసిద్ధ నటుడు కమల్ హాసన్ తన తాజా వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకెక్కారు. ఇటీవల జరిగిన ‘థగ్ లైఫ్’ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో కమల్ చేసిన వ్యాఖ్యలు కన్నడలో కలకలం రేపిన విషయం తెలిసిందే. “కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది” అనే వ్యాఖ్య స్థానికంగా తీవ్ర విమర్శల పాలయ్యింది. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక రాజకీయ పార్టీలు, ప్రజలు తీవ్రంగా స్పందించారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘థగ్ లైఫ్’ చిత్రాన్ని నిషేధించాలని హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా కమల్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, కమల్ హాసన్ తాజాగా కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి ఓ లేఖ రాశారు.
Read Also: Ladakh : లద్దాఖ్‌లో రిజర్వేషన్లు, స్థానికతపై కేంద్రం కీలక ప్రకటన
అందులో ఆయన తన ఉద్దేశ్యం వక్రీకరణ కావడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. రాజ్‌కుమార్ కుటుంబంతో నాకు ఉన్న అనుబంధం చాలా పాతది. శివరాజ్‌కుమార్(శివన్న) నా చిన్ననాటి స్నేహితుడు. ఆయనే ‘థగ్ లైఫ్’ ఆడియో వేడుకకు వచ్చినప్పుడు, ఆ బంధాన్ని ప్రేమగా గుర్తుచేసుకున్నాను. కానీ, నా మాటలు పక్కదారి పట్టడం నన్ను బాధించింది అని కమల్ ఆ లేఖలో వివరించారు. నా ఉద్దేశం ఒక్కటే తమిళ్, కన్నడ ప్రజలమంతా ఒక్క కుటుంబం. నేనెప్పటికీ కన్నడ భాషను తక్కువ చేయలేదు. ఆ భాషకు, ఆ సంస్కృతికి నేను చాలా గౌరవం ఇస్తాను. కన్నడ భాష కూడా తమిళంలాగే గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. నా సినీ ప్రయాణంలో నాకు కన్నడిగుల నుండి లభించిన ఆదరణను మరువలేను. వారి ప్రేమకు నేను రుణపడి ఉన్నాను అని కమల్ హాసన్ స్పష్టంగా తెలిపారు.
భాష అనేది కలిపే మాధ్యమం. సినిమాల మాదిరిగానే ప్రేమ, అనుబంధం మాత్రమే చెప్పగలదే గాని, విభేదాలు తేల్చదని నేను విశ్వసిస్తున్నాను. ఒక భాషను మరో భాష కంటే పైచేయిగా చూడడం నేను ఎప్పుడూ సమర్థించను. ప్రతి భాషకూ సమాన గౌరవం ఉండాలన్నదే నా స్థాయిగా ఉంది అని ఆయన అన్నారు. ఈ ఘటనతో శివరాజ్‌కుమార్‌కు ఇబ్బంది కలగడం తనకు బాధాకరమని, వారు మళ్లీ కలిసే రోజుకై ఎదురు చూస్తున్నానని చెప్పారు. సినిమా అనే మీడియం మన మధ్య వంతెనగా ఉంటుంది. గోడలుగా కాదు. ఈ సంఘటనలు మనల్ని మరింతగా కలిపే అవకాశం కావాలి తప్ప విడదీయకూడదు అని కమల్ హాసన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, మణిరత్నం దర్శకత్వంలో కమల్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రం ఈ నెల 5వ తేదీన ఘనంగా విడుదల కాబోతోంది. ఈ వివాదం సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.