Site icon HashtagU Telugu

Nil Salary for Ambani: అంబానీ శాలరీ సున్నా.. రెండేళ్లు ఫ్రీగా చెమటోడ్చిన ముకేశ్!!

Ambani Earning From IPL

కష్టపడి పనిచేస్తే జీతం తీసుకోవాలి. కానీ తన కంపెనీ కోసం బిలియనీర్ ముకేశ్ అంబానీ ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోకుండా పనిచేశారు.2021 – 2022 ఆర్ధిక సంవత్సరంలో ఆయన ఫ్రీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కోసం చెమటోడ్చారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల నుంచి ముకేశ్ అంబానీ ఇలాగే జీతం పుచ్చుకోకుండా కష్టపడుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినప్పటి నుంచి ఆయన తన కంపెనీ నుంచి శాలరీ తీసుకోవడం లేదు. స్వచ్చందంగానే తన రెమ్యూనరేషన్ ను వదులు కుంటున్నారు. 2020 -21, 2021-22 ఆర్ధిక సంవత్సరాల్లో వేతనాన్ని తీసుకోకుండా ముకేశ్ పని చేశారని రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డులను బట్టి వెల్లడైంది. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ముకేశ్ అంబానీ కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్‌ హోదాలో ఎలాంటి అలవెన్స్‌లను, కమిషన్లను, స్టాక్ ఆప్షన్లను, రిటైరల్ ప్రయోజనాలను పొందలేదు.

అంతకుముందు ఇలా..

అంతకుముందు వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా, ఎండీగా 2008-09 నుంచి ఆయన రూ.15 కోట్ల వార్షిక వేతనాన్ని పొందారు. 11 ఏళ్ల పాటు ఆయన అదే వేతనాన్ని తీసుకున్నారు. గత రెండేళ్లలో ముకేశ్ అంబానీ ఎలాంటి జీతం తీసుకోనప్పటికీ.. ఆయన కజిన్లు నిఖిల్, హితల్ మేస్వానీలు రూ.24 కోట్ల చొప్పున వేతనాన్ని పొందారు. ఇందులో రూ.17.28 కోట్ల కమిషన్లు కలిసి ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఎంపీఎస్ ప్రసాద్, పవన్ కుమార్ కపిల్ రెమ్యూనరేషన్లు కాస్త తగ్గాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో..

2021-22లో ప్రసాద్ రూ.11.89 కోట్లు పొందగా.. కపిల్ రూ.4.22 కోట్లను పొందారు. అంబానీ భార్య నీతా కంపెనీ బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సిట్టింగ్ ఫీజు కింద రూ.5 లక్షలను, కమిషన్ల కింద రూ.2 కోట్లను పొందారు. అంతకుముందు ఆమె సిట్టింగ్ ఫీజు రూ.8 లక్షలుగా, కమిషన్ రూ.1.65 కోట్లుగా ఉండేది. అంబానీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో మేస్వానీ బ్రదర్స్, ప్రసాద్, కపిల్‌లు హోల్ టైమ్ డైరెక్టర్లుగా ఉన్నారు.

Exit mobile version