Site icon HashtagU Telugu

Viral News: వైర‌ల్ అయ్యేంత మ్యాట‌ర్.. ఈ ఫొటోలో ఏముంది..?

Pooja Oil In Vodka Bottle

Pooja Oil In Vodka Bottle

భార‌త దేశంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లులు కుటుంబాన్ని చాలా పద్దతిగా, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి గృహిణుల‌కు వృథా చేయడమంటే అస్సలు ఇష్టం ఉండ‌దు. ఈ క్ర‌మంలో ఏదైనా వస్తువులు కొన్నప్పుడు, వాటి ప్యాకింగ్‌తో వచ్చే డబ్బాలు, సీసాలను సైతం కిచెన్‌లో ఉపయోగిస్తుంటారు. అంతేనా అవసరమైతే ఇంట్లో మగవారు తాగి పడేసిన మందు బాటిల్స్‌ను సైతం భలే చక్కగా ఉపయోగించగలరు.

ఇక అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఓ ఫోటోనే ఇందుకు నిదర్శనం అని చెప్పాలి. సాగ‌ర్ అనే నెటిజ‌న్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మామూలుగా ఆ ఫొటోను చూస్తే అన్ని పూజ సామాగ్రి క‌నిపిస్తాయి. అయితే కాస్త పరీక్షగా చూస్తే గానీ అస‌లు విష‌యం తెలియ‌దు. వొడ్కా బాటిల్‌లో పూజా అయిల్ నింపి ఉండ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. దీంతో డజను మంది హాజరైన పూజా కార్యక్రమంలో మా అమ్మ నన్ను ఇబ్బందిపడేలా చేసింద‌ని సాగ‌ర్ ఓ ఫొటో తీసి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.

ఈ క్ర‌మంలో సాగర్ షేర్ చేసిన ఫోటోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అనవసరంగా అమ్మను నిందించడం ఎందుకు పాపం, ఆ బాటిల్‌పై రాసిన ఇంగ్లీష్ పదాలు ఆమెకు అర్థం అయ్యిండ‌వ‌ని, దీంతో ఆ బాటిల్‌లో పూజా ఆయిల్ నింపేంసి వాడేసి ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌పై స్పందించిన సాగర్ తానేమీ తన తల్లిని నిందించట్లేదని తన అలవాట్ల గురించి ఆమెకు తెలుసునని, ఉద్దేశపూర్వకంగానే ఆమె అలా చేసిందని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సాగర్ పోస్ట్ చేసిన ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవడమే కాదు, నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. నిజంగా చెప్పాలంటే తల్లులు దేన్ని వృథాగా పోనివ్వరు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.