Oxygen On Moon : చంద్రుడిపై 800కోట్ల మందికి ల‌క్ష ఏళ్ల‌కు స‌రిప‌డా ఆక్సిజ‌న్‌.. కానీ..

చంద‌మామ నుంచి చ‌ల్ల‌ని క‌బురొచ్చింది. అవును..చంద‌మామ‌పైన 800కోట్ల మంది మ‌నుషులు 1 ల‌క్ష ఏళ్లు బ‌త‌క‌డానికి కావాల్సినంత ఆక్సిజ‌న్ ఉంద‌ట‌. పూర్తి వివ‌రాలు చ‌ద‌వండి.

  • Written By:
  • Updated On - November 16, 2021 / 03:18 PM IST

ఆస్ట్రేలియ‌న్ స్పేస్ ఏజ‌న్సీ, నాసా (Nasa) క‌లిసి చంద్రుడిపై చాలాకాలంగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాయి. 2021 అక్టోబ‌ర్ నెల‌లో చంద్రుడిమీద న‌డుస్తున్న అర్టెమిస్ ప్రోగ్రాంకు ఆస్ట్రేలియ‌న్ రోవ‌ర్‌ను (Australian Rover) పంపి అక్క‌డి రాళ్ల‌ను సేక‌రించాల‌ని భావించాయి. చంద్రుడిమీద భూమి త‌ర‌హా వాతావ‌ర‌ణం లేక‌పోయిన‌ప్ప‌టికీ కూడా హైడ్రోజ‌న్‌, నియాన్‌, ఆర్గాన్ వాయువుల‌తో కూడిన చిన్న లేయ‌ర్ ఉంద‌ని గ‌తంలోనే గుర్తించారు. ఈ నేప‌ధ్యంలో.. మ‌నుషులు జీవించ‌డానికి అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ చంద్రుడిపై ఉందా లేదా అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇన్నాళ్ల‌కు దొరికిందంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.

అవును.. చంద్రుడిమీద ఆక్సిన్ ఉంద‌ట‌. (Oxygen On Moon) అయితే, అది గ్యాస్ రూపంలో లేదు. చంద్రుడి ఉప‌రిత‌లాన్ని క‌ప్పేసిన దుమ్ము, ధూళి, రెగోలిత్ (Regolith Rocks) రాళ్ల‌లో నిక్షిప్త‌మైంద‌ని గుర్తించారు. ఆ రెగోలిత్ రాళ్ల నుంచి ఆక్సిజ‌న్‌ను తీయ‌గ‌లిగితే.. మాన‌వ నివాసానికి అక్క‌డ అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు.

మ‌న చుట్టూ దొరికే చాలా ఖ‌నిజాల్లో ఆక్సిజ‌న్ ఉంటుంది. అటు చంద్రుడిపై కూడా భూమ్మీద ఉండే సిలికా, అల్యూమినియం, ఐర‌న్‌, మెగ్నీసియం ఆక్స‌యిడ్ క‌లిగిన రాళ్ల‌లాంటివే ఉంటాయి. వీటిలో ఉండే ఆక్సిజ‌న్‌ను మాత్రం మ‌నం పీల్చ‌లేం. కొన్ని వేల‌కోట్ల సంవ‌త్స‌రాల నుంచి చంద్రుడి మీద ప‌డుతున్న ఉల్క‌ల నుంచి ఇవి త‌యార‌య్యాయి.

భూమ్మీద ఉండే మ‌ట్టిలోని ఖ‌నిజాలు చాలా ఏళ్లుగా మారుతూ వ‌స్తున్నాయి. క్ర‌మంగా వాటికి జీవ‌సంబంధ‌మైన , ర‌సాయ‌న సంబంధ‌మైన ల‌క్ష‌ణాలు వ‌చ్చాయి. కానీ.. చంద్రుడిపై ఉండే మ‌ట్టి, ఖ‌నిజాలు మాత్రం అలాంటి ప‌రిణామ‌క్ర‌మానికి గుర‌వ‌లేదంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.

 

వాటి నుంచి ఆక్సిజ‌న్ తీయడం సాధ్య‌మేనా?

చంద్రుడి ఉప‌రిత‌లంపై ఉన్న రెగోలిత్‌లో దాదాపు 45శాతం ఆక్సిజ‌న్ ఉంద‌ట‌. అయితే, ఇందాక చెప్పుకున్న‌ట్టు ఖ‌నిజాల‌తో అది క‌లిసిపోయి ఉంది. అంత గ‌ట్టి బాండ్‌ను (Chemical Bond) విడ‌దీయాలంటే శ‌క్తి అవ‌స‌ర‌మ‌వుతుంది. ఎలక్ట్రోలిసిస్ ద్వారా అల్యూమినియం నుంచి ఆక్సిజ‌న్‌ను వేరుచేసే ప్ర‌క్ర‌య‌లాంటిదే అక్క‌డ చేయ‌వ‌చ్చు కానీ.. ఈ ప‌రిణామం జ‌ర‌గ‌డానికి అవ‌స‌ర‌మైన శ‌క్తిని త‌యారుచేసే యాంత్రాలు అక్క‌డ ఎలా అందుబాటులో ఉంచాల‌న్న‌దే ఇప్పుడు అస‌లు చ‌ర్చ‌. చంద్రుడిపై ఉండే సొలార్‌, ఇత‌ర శ‌క్తుల స‌హాయంతో అది అవుతుందా అనే ప‌రిశోధ‌న సాగుతోంది.

ముందుగా ఘ‌న‌రూపంలో ఉన్న మెట‌ల్ ఆక్సైడ్‌ను వేడితో కానీ.. ఎల‌క్ట్రోలైట్స్ (Electrolytes) ప‌ద్ధ‌తిలో కానీ..ద్ర‌వ‌ప‌దార్ధంలోకి మార్చాలి. భూమ్మీద చేయ‌డానికి దీనికి అవ‌స‌ర‌మైన యంత్రాలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే, చంద్రుడి మీద చేయాలంటే అందుకు పెద్ద మొత్తంలో ఇండ‌స్ట్రియ‌ల్ ఎక్విప్‌మెంట్, వాటిని న‌డిపించ‌డానికి శ‌క్తి.. అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు శాస్త్ర‌వేత్త‌లు. అటు బుల్జియంకు చెందిన ఒక కంపెనీ కూడా చంద్రుడి మీద ఎన‌ర్జీ ఉత్ప‌న్నం చేసే యంత్రాల మీద ప‌రిశోధన‌లు చేస్తోంది. ఎక్స్‌ప‌రిమెంట్ ప‌ద్ధ‌తిలో మూడు రియాక్ట‌ర్ల‌ను చంద్రుడిపై 2025 నాటికి యురోపియ‌న్ దేశాల స‌హాయంతో నిర్మించాల‌ని భావిస్తోంది.

ఎంత ఆక్సిజ‌న్ ఉండ‌వ‌చ్చు?

ఇంత క‌ష్ట‌ప‌డి ఆ ప్ర‌క్రియ మొద‌లుపెట్టినా.. ఎంత మొత్తంలో ఆక్సిజ‌న్‌ను అక్క‌డ మ‌నం త‌యారుచేయ‌గ‌లం? దానికి కూడా ఒక లెక్క వేశారు. కేవ‌లం చంద్రుడి ఉప‌రిత‌లంపై ఉన్న క్యూబిక్ మీట‌ర్ (Cubic Meter)  రెగోలిత్ రాయిలో 1.4 ట‌న్నుల ఖ‌నిజం ఉంటుంది. అందులో 630కేజీల ఆక్సిజ‌న్ ఉంటుంద‌ని చెబుతున్నారు. ఒక వ్య‌క్తి రోజుకు చంద్రుడిపై జీవించి ఉండాలంటే 800 గ్రాముల ఆక్సిజ‌న్ అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని నాసా చెబుతోంది. అంటే.. 630కిలోలతో ఒక మ‌నిషి రెండేళ్ల పాటు జీవించ‌గ‌ల‌డు.ఒక రెగోలిత్ రాయి లోతు 10 మీట‌ర్లు ఉంటుంద‌ని అనుకుంటే..చంద్రుడి ఉప‌రితలంపై ఉన్న కేవ‌లం 10మీట‌ర్ల లోతు రాయి 800 కోట్ల మందికి ఒక ల‌క్ష‌ల ఏళ్ల పాటు ఆక్సిజ‌న్‌ను అందించ‌గ‌ల‌దు.