PM Modi : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో తన దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’ను ప్రధాని మోడీకి ప్రదానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ బిస్సేస్సర్ మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. “మోడీ గారూ, మీ నాయకత్వానికి మా శిరస్సు వంచి నమస్కారాలు,” అంటూ ఆయన సేవలను కొనియాడారు. ప్రపంచ నేతగా మోడీ చూపుతున్న ప్రబల నాయకత్వం, విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులతో ఆయన కొనసాగిస్తున్న బలమైన సంబంధాలు, ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో తీసుకున్న మానవతా నిర్ణయాలు ఈ గౌరవానికి కారణంగా పేర్కొన్నారు.
Read Also: Show Time : షో టైం మూవీ ఎలా ఉందంటే ..!!
కరోనా సమయాల్లో మోడీ తీసుకున్న వ్యాక్సిన్ మైత్రి చర్యలతో మాకు సహా అనేక చిన్న దేశాలకు భారీగా మద్దతు లభించింది. ఇది కేవలం దౌత్యకౌశలం కాదు, ఇది మానవత్వానికి నిదర్శనం అని ఆమె అన్నారు. మోడీ ప్రస్తుతం భారతదేశాన్ని ఆర్థిక, సాంకేతిక రంగాలలో ఆధునీకరించిన దార్శనిక నాయకుడిగా అభివర్ణిస్తూ, ఆయన ద్వారా దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా పెరిగిందని చెప్పారు. మోడీ ఒక పరివర్తనా శక్తిగా, భారతదేశ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా అభివృద్ధి చేయడమే కాకుండా, దేశాన్ని ప్రపంచస్థాయిలో శక్తివంతంగా నిలబెట్టారు. ఈ కారణంగానే మా దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆయనకు అందించబోతున్నాం అని స్పష్టం చేశారు.
మోడీ గతంలో 2002లో ఒక సాంస్కృతిక రాయబారిగా ట్రినిడాడ్ అండ్ టొబాగోను సందర్శించిన సందర్భాన్ని కమలా ప్రసాద్ గుర్తు చేస్తూ, ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా తిరిగి వస్తుండటం గర్వకారణమన్నారు. ఇది ట్రినిడాడ్ ప్రజల పట్ల ఉన్న మోదీగారి ప్రేమకు గుర్తింపుగా భావిస్తున్నాం. ఆయన పర్యటన మాకు గౌరవాన్ని తీసుకొస్తోంది అని ఆమె తెలిపారు. ఇటీవలే ప్రధాని మోడీ గయానా, డొమినికా, బార్బడోస్ వంటి దేశాల నుంచి కూడా అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇవన్నీ కలిపి మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాధాన్యతను, ప్రజలలో ఆయన పెంచుకున్న విశ్వాసాన్ని స్పష్టంగా చాటుతున్నాయి. మొత్తానికి, ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రకటించిన ఈ గౌరవం ప్రధాని మోదీకి వరుసగా లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపులలో మరో మైలురాయిగా నిలిచింది. ఇది భారతదేశం గర్వించదగ్గ సందర్భమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: One Big Beautiful Bill: అమెరికాలో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం.. ఈ బిల్లు ప్రభావం భారత్‌పై ఎంత?