Site icon HashtagU Telugu

PM Modi : ఘనా అత్యున్నత పురస్కారంతో మోడీ సత్కారం: భారత-ఘనా బంధానికి కొత్త అధ్యాయం

Modi honoured with Ghana's highest award: A new chapter in India-Ghana ties

Modi honoured with Ghana's highest award: A new chapter in India-Ghana ties

PM Modi : ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం లభించింది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనా తన అత్యున్నత పౌర పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ను ప్రధానికి అందించి సత్కరించింది. రెండు రోజుల ఘనా పర్యటనలో భాగంగా ప్రధాని బుధవారం అక్రా నగరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ గౌరవాన్ని స్వీకరించారు. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామా స్వయంగా ఈ అవార్డును ప్రధానికి ప్రదానం చేయడం విశేషం. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..ఈ అవార్డును పొందడం నా జీవితంలో గౌరవకరమైన క్షణం. ఇది భారత్ మరియు ఘనా మధ్య ఉన్న బలమైన సంబంధాలకు సూచిక. ఈ గౌరవం 140 కోట్ల మంది భారతీయుల తరఫున నేను అంకితంగా స్వీకరిస్తున్నాను. ఇది మన యువత ఆశయాలు, మన సాంస్కృతిక వారసత్వం, మరియు ద్వైపాక్షిక బంధాలకు అంకితం అని పేర్కొన్నారు.

మోడీను ఘనంగా ఆహ్వానించిన ఘనా ప్రభుత్వం, అక్కడి ప్రజలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనాను సందర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మోడీ బుధవారం రాత్రి కోటోకా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో 21 తుపాకీలతో గౌరవ వందనం ఇస్తూ ఘన స్వాగతం పలికారు. ఘనా అధ్యక్షుడు మహామా స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలకడం, భారత ఘనతను ప్రతిబింబించే సంఘటనగా నిలిచింది. ఇక మోడీ ఘనాలో చేసిన వ్యాఖ్యల్లో భారతదేశం మరియు ఘనా మధ్య ఉన్న ఉమ్మడి విలువలు, స్వేచ్ఛ కోసం పోరాటం, మరియు సమ్మిళిత భవిష్యత్తు సాధనపై ఉన్న ఉద్దేశపూర్వకత ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని తెలిపారు. భారతదేశం-ఘనా సంబంధాల్లో ఇది ఒక కొత్త మైలురాయి అని వ్యాఖ్యానించారు.

ఈ పర్యటనలో భాగంగా మోడీ ఘనా అధ్యక్షుడు మరియు ఇతర ఉన్నతాధికారులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆర్థిక సహకారం, వాణిజ్య సంబంధాలు, విద్య, డిజిటల్ టెక్నాలజీ, మరియు ఆరోగ్య రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసే ఒప్పందాలపై చర్చించారు. ఘనా పర్యటన అనంతరం ప్రధాని మోడీ ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ మరియు నమీబియా దేశాలకు పర్యటన కొనసాగిస్తారు. ఈ నెల 3, 4వ తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించి, 4, 5 తేదీల్లో అర్జెంటీనాలో ఉండనున్నారు. అనంతరం బ్రెజిల్‌లో జరగనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. చివరగా నమీబియాలో పర్యటించి, స్వదేశానికి తిరిగి రానున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీకి లభించిన గౌరవం భారతదేశం ప్రస్తుత అంతర్జాతీయ స్థాయిని, ప్రపంచ దేశాల మధ్య అభివృద్ధి చెందుతున్న సంబంధాలను ప్రతిబింబిస్తోంది. ఘనాలో ఆయనకు లభించిన అద్భుత స్వాగతం, సత్కారం ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Amarnath Yatra 2025 : ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర..కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు