Bharat Rice : ‘భారత్‌ రైస్’ సేల్స్ నేటి నుంచే.. రూ.29కే కేజీ సన్నబియ్యం.. ఇలా కొనేయండి

Bharat Rice :  ఎట్టకేలకు ‘భారత్ రైస్’ బియ్యం విక్రయాలు ఈరోజు సాయంత్రం నుంచే మొదలుకానున్నాయి.

  • Written By:
  • Updated On - February 6, 2024 / 09:13 AM IST

Bharat Rice :  ఎట్టకేలకు ‘భారత్ రైస్’ బియ్యం విక్రయాలు ఈరోజు సాయంత్రం నుంచే మొదలుకానున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌  భారత్ రైస్ విక్రయాలను ప్రారంభిస్తారు. సన్నబియ్యాన్ని కేజీకి కేవలం రూ.29 చొప్పున అందించడమే కేంద్ర ప్రభుత్వ  ‘భారత్ రైస్’(Bharat Rice) బ్రాండ్ ప్రత్యేకత. 5 కిలోలు, 10 కిలోల సంచుల్లో ఈ బియ్యం లభిస్తాయి. తొలి విడతగా ఈ బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(నాఫెడ్), భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య(ఎన్సీఎఫ్సీ) , కేంద్రీయ భండార్‌ విక్రయ కేంద్రాల్లో సేల్ చేస్తారు. ఇందుకోసం 5 లక్షల టన్నుల సన్న  బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సప్లై చేయనుంది.  భారత్  రైస్ మీకు కావాలంటే నాఫెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nafedbazaar.com/product-tag/online-shopping లోకి వెళ్లాలి. ఇక్కడ మీకు భారత్ రైస్‌తోపాటూ.. పప్పు, పంచదార, శనగలు ఇలా చాలా ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. భారత్ రైస్‌ని కేజీ రూ.29కి కేంద్రం అమ్ముతోంది.  భారత్ గోధుమపిండిని కేజీ రూ.27.50కి, భారత్ శనగపప్పును కేజీ రూ.60కి నాఫెడ్‌లో అమ్ముతున్నారు. నాఫెడ్‌లో కొనుక్కోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకొని, తర్వాత లాగిన్ అయ్యి, మీ అడ్రెస్ ఇచ్చి, కొనుక్కోవచ్చు. భారత్ రైస్‌ని నాఫెడ్‌తోపాటూ.. ఇతర ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో సైతం కొనొచ్చు.

We’re now on WhatsApp. Click to Join

బియ్యం ధర రెక్కలు తొడిగింది. నాణ్యమైన సోనా మసూరీ బియ్యం కేజీకి రూ.60 దాకా పలుకుతోంది. అయితే అంత ధరకు కొనలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అదే నాణ్యత గల బియ్యాన్ని కేంద్ర సర్కారు భారత్ రైస్ పేరుతో కేజీ రూ.29కే అమ్ముతోంది. 2022 సంవత్సరంతో పోలిస్తే 2023 సంవత్సరంలో బియ్యం ధరలు 26 శాతం మేర  పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త బియ్యం తినలేక.. పాత బియ్యం కొనలేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రస్తుతం క్వింటాల్ సన్న బియ్యం ధర సుమారుగా రూ.6,500కు చేరింది. రిటైల్ మార్కెట్‌లో 25 కిలోల పాత బియ్యం ధర రూ.1500 పైగా పలుకుతోంది. అయితే గతేడాది ఇదే సమయానికి మార్కెట్‌లో సన్న బియ్యం ధర క్వింటాల్‌కు రూ.3000 నుంచి రూ.3500 వరకు ఉంది. కానీ ప్రస్తుతం రూ. 6 వేల నుంచి రూ.6500 వరకు చేరింది.

Also Read :Viveka Murder Case: వివేకా హత్య కేసు డైరీని డిజిటలైజ్ చేయాలని సీబీఐను ఆదేశించిన సుప్రీంకోర్టు