తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మంత్రులు సీతక్క, కొండా సురేఖ గురువారం (జనవరి 8) మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మేడారం సమ్మక్క, సారక్క మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసి.. వనదేవతల పండుగకు రావాలని కోరనున్నట్లు సమాచారం. కాగా, మేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహా జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది.
- కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కాంగ్రెస్ మంత్రులు
- మాజీ ముఖ్యమంత్రితో ప్రత్యేక భేటీ
- మేడారం మహాజాతరకు రావాలని ఆహ్వానం
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కాంగ్రెస్ మంత్రులు వెళ్లనున్నట్లు సమాచారం. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో గురువారం (జనవరి 8న) మంత్రులు భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ సీఎంను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క, సారక్క మహా జాతర ఆహ్వాన పత్రికను అందించి.. వనదేవతల పండుగకు రావాలని కోరనున్నట్లు సమాచారం.
మేడాకం సమ్మక్క, సారక్క మహా జాతర..
కాగా, మేడాకం సమ్మక్క, సారక్క మహా జాతర.. జనవరి 28న ప్రారంభమై జనవరి 31న ముగియనుంది. ఈ పండుగకు ఇప్పటికే సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సంక్రాంతి సెలవులు కూడా ఉండటంతో ఈసారి జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహా జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు. అందుకే ఈ వనదేవతల మహా జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. భారీగా నిధులు కేటాయించింది.
మేడారం జాతర జరిగే ప్రాంతంతో పాటు పరిసర గ్రామాల్లో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా భద్రత, రవాణా, తాగునీరు, వైద్య సదుపాయాల ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని.. ఈసారి మేడారం జాతర కన్నుల పండువగా జరగనుందని అధికారులు చెబుతున్నారు.
మేడారం మహా జాతరలో నాలుగు రోజులు ప్రధాన కార్యక్రమాలు జరుగుతాయి. జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులను గద్దెలపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది. జనవరి 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెపైకి తీసుకువస్తారు. జనవరి 30న భక్తులు అమ్మవార్లకు మొక్కులు (బంగారం) సమర్పించుకుంటారు. ఇక చివరి రోజు అయిన జనవరి 31న దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.
మరోవైపు, ఈసారి జతరకు సమ్మక్క, సారక్క గద్దెలు కొత్త హంగులతో ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో సమ్మక్క-సారక్క గద్దెలను నిర్మిస్తున్నారు. గద్దెల ఎత్తును పెంచడంతో పాటు.. చుట్టూ పాలరాతి గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రద్దీని కూజా తట్టుకునేలా గద్దెల ప్రాంగణాన్ని 180 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు విస్తరిస్తున్నారు. కాగా, జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న మేడారం వెళ్లనున్నారు.
