Ponnam Prabhakar : తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, తాజాగా జరిగిన పరిణామాలతో మరోసారి అది నిరూపితమైందని ఆయన అన్నారు. బీజేపీలో ముగ్గురు బీసీ ఎంపీలు ఉన్నా, అనేక మంది బీసీ సీనియర్ నేతలు ఉన్నా, పార్టీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. గత ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న హామీ ఇచ్చిన బీజేపీ, కనీసం బీసీ వర్గానికి సభాపక్ష నాయకుడి పదవినైనా ఇవ్వలేదు. ఇది బీసీల పట్ల ఉన్న వారి అసలైన దృష్టిని చూపిస్తోంది అని పొన్నం ఆరోపించారు.
Read Also: Sangareddy Chemical Plant Explosion : 13 కు చేరిన మృతుల సంఖ్య
పార్టీ అధ్యక్ష పదవి కోసం బీసీ నేత ఒకరు నామినేషన్ వేయకుండా అడ్డుకున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఫ్యూడల్ పార్టీ. బీసీలకు ఎప్పుడూ న్యాయం జరగలేదు. ఒకవైపు బీసీ నాయకుల మద్దతుదారులను బెదిరించడం, మరోవైపు బీసీని అధ్యక్ష పదవికి అర్హుడిగా పరిగణించకపోవడం తీవ్ర నిరంకుశత్వానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..బీజేపీలోని మీ స్వంత నాయకులే బీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని బయటపెడుతున్నారు. అలాంటప్పుడు పార్టీ అధిష్టానం దీనికి సమాధానం చెప్పాలంటే ఏముంటుంది?.అని ప్రశ్నించారు. బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు న్యాయం చేయగల ఏకైక పార్టీ కాంగ్రెస్‌నే అని స్పష్టం చేశారు.
సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్న కట్టుబాటును ఆయన వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో కల్పిస్తూ శాసనసభలో చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇది నిజమైన సామాజిక న్యాయం అని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదే బీజేపీ మాత్రం గతంలో బీసీ నేత బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఎన్నికల ముందు కిషన్ రెడ్డిని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన అంశాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయడానికి నాంపల్లి స్టేట్ ఆఫీస్‌కి వెళ్ళిన రాజాసింగ్‌ను, ఆయన అనుచరులను బెదిరించారని ఆరోపించారు. ఇది బీజేపీలో బీసీలకు ఎలాంటి స్థానం లేదనే స్పష్టతని మరోసారి తెరపైకి తెచ్చింది అని తెలిపారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బీసీల కోసం నినాదాన్ని ఎత్తుకున్నారని, ఆయన నేతృత్వంలోనే బీసీలకు, ఇతర వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగగలదని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇలాంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో, బీజేపీ నేతృత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి పొన్నం వ్యాఖ్యలు బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలను వెలికి తీయడమే కాకుండా, బీసీ వర్గాల్లో ఆత్మవిమర్శకర చర్చకు దారితీసే అవకాశం ఉంది.