Minister Ponguleti Srinivas Reddy : తెలంగాణలో ప్రభుత్వ భూమి అంగులం కూడా ఆక్రమణకు గురికాకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తహసీల్దారులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాన్యులకు మేలు చేసేలా రాష్ట్ర రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాసిల్దారుల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమీక్షిస్తామన్నారు. ప్రజలు కోరుకుంటున్న దిశలో రెవెన్యూ వ్యవస్థ పని చేస్తుందా లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తహసీల్దారులకు రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి పొంగులేటి సూచించారు.
Read Also: YS Jagan : దీనర్థం ఏమిటి చంద్రబాబు?..జగన్ మరో ట్వీట్
రెవెన్యూ కార్యాలయానికి వచ్చే రైతులు, పేదలు, సామాన్యులకు వీలైనంత మేరకు చేయగలిగినంత సహాయం చేయాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పేద, సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. రైతులకు మేలు జరిగే విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు.
రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తాం. తహశీల్దార్ల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమీక్షిస్తాం. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జోడెడ్లలా పనిచేసి ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి. ప్రభుత్వంలోని అన్ని శాఖలకంటే రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనది. అన్ని సందర్భాల్లో రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక పాత్ర పోషిస్తారు. రాష్ట్రంలో మొత్తం 972 మంది తహశీల్దార్లు ఉన్నారు.. గ్రామ, మండల స్థాయిలో ఉండే సమస్యలు, ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశాం. రెవెన్యూ చట్టాల సవరణకు.. క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలపై మీరు ఇచ్చే సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుంటాం” అని పొంగులేటి తెలిపారు.