Antarctica : అంటార్కిటికా మంచులోకీ చొరబడిన ప్లాస్టిక్.. తొలిసారిగా గుర్తింపు

తినడానికి తిండి లేని చోటు భూమిపై ఉంది.. కానీ ప్లాస్టిక్‌ లేని చోటు లేనే లేదు!! ఈ నేపథ్యంలో తొలిసారిగా అంటార్కిటిక్ మహాసముద్రంలో కురిసిన మంచులో తొలిసారిగా సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులను గుర్తించారు.

  • Written By:
  • Publish Date - June 12, 2022 / 12:00 PM IST

తినడానికి తిండి లేని చోటు భూమిపై ఉంది.. కానీ ప్లాస్టిక్‌ లేని చోటు లేనే లేదు!! ఈ నేపథ్యంలో తొలిసారిగా అంటార్కిటిక్ మహాసముద్రంలో కురిసిన మంచులో తొలిసారిగా సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులను గుర్తించారు. దీనివల్ల అంటార్కిటిక్ ప్రాంతంలో మంచు కరిగే వేగం మునుపటి కంటే బాగా పెరుగుతుందనే ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఫలితంగా సముద్ర తీర ప్రాంతాలు నీట మునిగి, అక్కడి జనం నిరాశ్రయులయ్యే ముప్పు ఉంటుంది. అంటార్కిటిక్ ప్రాంతంలోని మంచులో, ఉపరితల జలంలో ప్లాస్టిక్‌ను గతంలోనే గుర్తించారు. అయితే కొత్తగా కురిసిన మంచులోనూ ఆ రేణువులు బయట పడటం ఇదే తొలిసారి.

పీహెచ్‌డీ విద్యార్థిని అలెక్స్‌ అవెస్‌ అధ్యయనంలో..

పర్యాటకుల ద్వారానే ప్లాస్టిక్‌ అంటార్కిటిక్‌ దాకా చేరి ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ కాంటర్బరీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థిని అలెక్స్‌ అవెస్‌ నిర్వహించిన పరిశోధనలో ఈవిషయాలు వెలుగుచూశాయి. అంటార్కిటిక్‌లోని రాస్‌ ఐస్‌ షెల్ఫ్‌ నుంచి మంచు నమూనాలను సేకరించి, కెమికల్‌ అనాలిసిస్‌ టెక్నిక్‌తో అధ్యయనం చేయగా.. వాటిలో సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు కనిపించాయి. అంటార్కిటిక్‌ ప్రాంతంలో కరిగిన ప్రతి లీటర్‌ మంచులో సగటున 29 మైక్రోప్లాస్టిక్‌ రేణువులున్నట్లు వెల్లడైంది. ఇటాలియన్‌ హిమానీ నదాల్లో కంటే అంటార్కిటిక్‌లోని రాస్‌ ఐలాండ్, స్కాట్‌ బేస్‌ల్లో ప్లాస్టిక్ 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సౌందర్య ఉత్పత్తుల వల్ల గత పదేళ్లలో భారీ పరిమాణంలో మైక్రో ప్లాస్టిక్, టూరిజం వల్ల 25.5 బిలియన్‌ సింథటిక్‌ ఫైబర్లు అంటార్కిటిక్‌ మహా సముద్రంలో చేరుతోంది. చేపల వేట తదితరాల వల్ల కూడా ఈ మహా సముద్రంలోకి ప్లాస్టిక్‌ వచ్చి చేరుతోంది.