Mehul Choksi : వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీ కుట్ర, మోసం, అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేసింది. దీంతో తన అరెస్టుని ఛోక్సీ బెల్జియం కోర్టులో సవాల్ చేశారు. అయితే, న్యాయస్థానంలో అతడికి ఎదురుదెబ్బ తగిలింది. ఛోక్సీ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగ్గా.. కోర్టు కేసును వాయిదా వేసింది. ఇక, గతవారం బెయిల్ కోసం ఛోక్సీ పిటీషన్ దాఖలు చేశారు. అయితే, న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. ఈ విషయాన్ని ఛోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ వెల్లడించారు. ఛోక్సీ తీవ్ర అనారోగ్యం పాలయ్యారని, క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారని అగర్వాల్ తెలిపారు.
Read Also: Minister Seethakka : మావోయిస్టుల ఏరివేతను ఆపండి.. సీతక్కకు భారత్ బచావో ప్రతినిధులు వినతి
ఈ పిటిషన్‌లో అతడు బెల్జియం అధికారులపై పలు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తన అరెస్టుకు సంబంధించి అధికారులు సరైన చట్ట విధానాలను అనుసరించలేదని, తన ప్రాథమిక హక్కులకు సైతం భంగం కలిగించారని ఆరోపించాడని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక, 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మోసం చేశారని ఆరోపణలు వెల్లువెత్తిన అనంతరం ఛోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీ (కేసులో మరో ప్రధాన నిందితుడు) దేశం విడిచి పారిపోయారు. అతడిని భారత్ కు రప్పించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా, మెహుల్ ఛోక్సీ ఆంటిగ్వా-బార్బుడాకు వెళ్లగా.. లండన్‌లో నీరవ్‌మోదీ ఆశ్రయం పొందాడు. ఛోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని గత నెల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆ దేశ జాతీయురాలైన తన సతీమణి ప్రీతి ఛోక్సీ సాయంతో 2023 నవంబరులో అతడు ఎఫ్ రెసిడెన్సీ కార్డ్ పొందాడు. అందుకు అతడు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా.. అతడికి భారత్‌లో, అంటిగ్వాలో పౌరసత్వాలు ఉన్న విషయాన్ని దాచి పెట్టాడు. ఈ కారణాలతోనే అక్కడి అధికారులు ఛోక్సీని అరెస్టు చేశారు.
Read Also: YCP MLAS : వైసీపీకి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పబోతున్నారా..?