Site icon HashtagU Telugu

Earthquake : మయన్మార్‌, బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 7.7గా నమోదు

Massive earthquake hits Myanmar, Bangkok, measuring 7.7 on the Richter scale

Massive earthquake hits Myanmar, Bangkok, measuring 7.7 on the Richter scale

Earthquake : మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. పలు కార్యాలయాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. భీకర ప్రకంపనలకు ప్రజలు గజగజ వణికిపోయారు. భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 12 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్‌లో ప్రకంపనల తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. అటు భారత్‌ సహా ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఈ ప్రభావం కన్పించింది.

స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు బ్యాంకాక్‌లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారమ్‌ మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. సెంట్రల్‌ మయన్మార్‌ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే గుర్తించింది. థాయిలాండ్‌లో భూప్రకంపనలకు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కూడా ఊగిపోయాయి. స్విమ్మింగ్ పూల్ నీళ్లు కదిలిపోయాయి. పలు బిల్డింగ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇక పర్యాటన నగరమైన చియాంగ్ మాయి‌లో టూరిస్టులు బెంబేలెత్తిపోయారు. ఇక ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. పలు భవంతులు నేలమట్టమయ్యాయి. ఓ భారీ భవంతి పైఅంతస్తులో ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌లోని నీరు కిందకు పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం పేకమేడలా కూలిన దృశ్యాలు బయటికొచ్చాయి. ప్రమాదం సమయంలో ఆ భవనంలో ఎవరైనా కార్మికులు ఉన్నారా? శిథిలాల కింద చిక్కుకుపోయారా? అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇక ఈ భూకంపంలో ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ ఉదయం భారీ భూకంపం సంభవించినట్లుగా అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయ్‌లాండ్‌లో ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మరోవైపు, మయన్మార్‌లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లు తెలిసింది. పలు రహదారులపై చీలికలు ఏర్పడ్డాయి. ఈ భూకంప ప్రభావం ఆగ్నేయాసియా దేశాలపైనా కన్పించింది. భారత్‌లోని కోల్‌కతా, ఇంఫాల్‌, మేఘాలయలో స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. మేఘాలయ ఈస్ట్‌గారో హిల్స్‌లో 4 తీవ్రతతో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్‌లోనూ 7.3 తీవ్రతతో భూమి కంపించినట్లు తెలుస్తోంది.

Read Also: Mongolia’s Gobi Desert : ఎడారి లో గోళ్ల డైనోసార్ల అవశేషాలు