Site icon HashtagU Telugu

Meta employees: అనుకున్నదే జరిగింది.. 11 వేల మంది ఉద్యోగాలు కట్..!

Mark Zuckerberg

Mark Zuckerberg 2

అందరూ అనుకున్నదే జరిగింది. ఎలాన్ మస్క్ బాటలోనే జుకర్ బర్గ్ నడిచారు. ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా నుంచి 11 వేల మందిని ఇంటికి పంపించేందుకు రంగం సిద్ధం చేశారు. ఉద్యోగుల సంఖ్యను 13 శాతం మేర తగ్గించుకుంటున్నట్లు మెటా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ బుధవారం ప్రకటించారు. తొలి ప్రధాన రౌండ్ లేఆఫ్‌లలో కంపెనీ 11,000 మందికి పైగా ఉద్యోగాలను తొలగిస్తుందని మెటా ప్లాట్‌ఫామ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.

ఉద్యోగుల తొలగింపు విషయాన్ని మెటా చరిత్రలో కఠినమైన రోజుగా జుకర్‌బర్గ్‌ అభివర్ణించారు. ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి పెడతామని, నియామకాలను నిలిపివేయనున్నట్లు జుకర్ చెప్పారు. తొలగింపునకు గురైన ఉద్యోగులకు క్షమాపణ చెప్పారు. తొలగించిన ఉద్యోగులకు 16 వారాల ప్రాథమిక వేతనాన్ని చెల్లించనున్నామని తెలిపారు. 2004లో ఫేస్‌బుక్‌ ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగాలను తొలగించడం ఇదే తొలిసారి. డిజిటల్‌ ప్రకటనల ఆదాయం తగ్గుముఖం పట్టడం, ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతున్న వేళ మెటా ఈ నిర్ణయం తీసుకుంది. ఆదాయం తగ్గడం వల్ల దీంతో కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మెటా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జుకర్‌బర్గ్‌ అన్నారు. దీనంతటికీ తనదే బాధ్యత అని పేర్కొన్న మార్క్‌.. తొలగింపునకు గురైన ఉద్యోగులకు ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పారు.