Maoist : తెలంగాణ రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క)కు మావోయిస్టుల పేరిట ఒక హెచ్చరికల లేఖ వైరల్ అవుతోంది. ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలపై మంత్రి సీతక్క మౌనం పాటిస్తున్నారన్న విమర్శలతో ఈ లేఖ సంచలనం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలపై వివక్ష చూపుతుంటే, గిరిజనుల నేతగా ఉన్న మంత్రి మాత్రం స్పందించకపోవడం పట్ల మావోయిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో ముఖ్యంగా ములుగు, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, అధికారులు తీసుకుంటున్న ఆంక్షలు, అటవీ శాఖ దాడుల గురించి వివరంగా రాశారు. 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇది జంతువుల కోసమా లేక కార్పొరేట్ సంస్థల కోసమా? అని లేఖలో ఘాటుగా ప్రశ్నించారు. జీవో నెంబర్ 49ను ప్రస్తావిస్తూ, ఈ జీవో ద్వారా గిరిజనులు తమ పూర్వీకుల భూములను కోల్పోతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక కోయ మహిళకు జనరల్ పోర్ట్‌ఫోలియో రావడం కొందరికి జీర్ణించలేకపోతుంది. ఎన్నికల సమయంలో నన్ను ఓడించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు అని మంత్రి సీతక్క తెలిపారు. అంతేగాక, గిరిజనుల ప్రయోజనాల కోసం తాను ఎప్పుడూ పోరాడుతానని, అవసరమైతే జీవో 49పై తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. మావోయిస్టుల లేఖ నిజమేనో, రాజకీయ కుట్రలో భాగమో అనే అనుమానాల నడుమ ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో గిరిజనుల భద్రత, హక్కులు మరోసారి దృష్టిలోకి వచ్చిన ఈ సందర్భంలో, ప్రభుత్వ స్పందన కీలకం కానుంది.
Read Also: Jagannath Rath Yatra : జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి