Union Minister Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ భారతీయ విద్యా భవన్ పాఠశాల లో నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఎంపికైన 155 మందికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడం అత్యంత అవసరం అని పేర్కొన్నారు. యువతతో ఎన్నో అద్భుతాలను సాధించవచ్చని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇక ఇప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి భారత్ చేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు.
రాబోయే 25 సంవత్సరాలు దేశానికి అమృత కాలం అని ఆయన తెలిపారు. దాదాపు 75 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో శాంతి, భద్రత లేనప్పుడు పెట్టుబడులు రాకలేక పోతాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో కఠినమైన దృఢత్వం కనపరచామని చెప్పారు. వ్యవసాయ విధానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. విద్యుత్ కొరతను నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, అన్ని రంగాల అభివృద్ధికి మద్దతు ఇస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.