Delhi Liquor Case : ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బెయిలు షరతులను అత్యున్నత న్యాయస్థానం బుధవారం నాడు సడలించింది. బెయిలు షరతుల ప్రకారం, వారంలో రెండు సార్లు విచారణ కార్యాలయంలో ఆయన రిపోర్ట్ చేయాల్సి ఉండగా, ఇక నుంచి ఆ అవసరం లేదని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సడలింపు ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అవినీతి, మనీలాండరింగ్ కేసులకు సంబంధించి మనీష్ సిసోడియాకు ఆగస్టు 9వ తేదీన ఇచ్చిన బెయిల్ షరతులను సవరిస్తున్నట్లు తెలిపింది.
అయితే ఈ ఉత్తర్వులు సీబీఐ, ఈడీ కేసులకు మాత్రమే వర్తిస్తుందని.. అయితే ఇప్పటికీ ట్రయల్ కోర్ట్ ప్రొసీడింగ్‌లకు మనీష్ సిసోడియా క్రమం తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మనీష్ సిసోడియా ఇప్పటికే 60 సార్లు సీబీఐ, ఈడీ అధికారుల ముందు హాజరై బెయిల్ షరతులను పాటించారని నవంబర్ 22వ తేదీన వాదనల సందర్భంగా ఆయన తరఫు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ పేర్కొనగా.. తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీష్ సిసోడియాను గతేడాది ఫిబ్రవరి 26వ తేదీన సీబీఐ అరెస్ట్ చేయగా.. అదే ఏడాది మార్చి 9వ తేదీన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. దీంతో గతేడాది ఫిబ్రవరి 28వ తేదీన ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి మనీష్ సిసోడియా రాజీనామా చేశారు. ఇక 17 నెలల జైలు జీవితం తర్వాత.. ఈ ఏడాది ఆగస్ట్ 9వ తేదీన సుప్రీంకోర్టు మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.