Kolkata : దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సౌత్ కలకత్తా లా కాలేజీ గ్యాంగ్‌రేప్ కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి చెందిన నేత మనోజిత్ మిశ్రా శరీరంపై గాయాలున్నట్లు వైద్య పరీక్షల ద్వారా తేలింది. ఈ గాయాలు బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఏర్పడ్డవని పోలీసులు వెల్లడించారు. ఇదే సమయంలో, ప్రధాన నిందితులైన ముగ్గురి పోలీస్ కస్టడీని జులై 8 వరకు పొడిగిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 25న కాలేజీ క్యాంపస్‌లోని సెక్యూరిటీ గార్డు గదిలో ఈ అఘాయిత్యం జరిగింది. బాధితురాలు తన వాంగ్మూలంలో తాను తీవ్రంగా ఎదురు తిరిగాను అని చెప్పగా, తాజాగా వెలుగులోకి వచ్చిన గాయాల ఆధారాలు ఆమె మాటలకు బలాన్నిచ్చాయి. ఆదివారం నాడు నిర్వహించిన వైద్య పరీక్షల్లో మనోజిత్ శరీరంపై గాట్లు, గోటి గాయాలు ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు.
Read Also: War 2 : ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ రైట్స్ దక్కించుకున్న నాగవంశీ..?
ఈ కేసులో మనోజిత్ మిశ్రాతో పాటు, కాలేజీ విద్యార్థులైన జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీని జూన్ 26న అరెస్టు చేశారు. వారి కస్టడీ జులై 8 వరకు పొడిగించగా, మరో నిందితుడు సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీ కస్టడీ జులై 4 వరకు పొడిగించారు. అతనికి క్రిమినల్ హిస్టరీ లేదని వాదించినప్పటికీ, కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ దారుణ ఘటన నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంది. మనోజిత్ మిశ్రా తాత్కాలిక ఉద్యోగాన్ని రద్దు చేయడంతో పాటు, ఇతర ఇద్దరు విద్యార్థులను కాలేజీ నుంచి బహిష్కరించారు. అంతేగాక, అలీపూర్ కోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న మనోజిత్‌కు సంబంధించిన బార్ కౌన్సిల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పాలకమండలి సిఫార్సు చేసింది.
కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన 9 మందితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆధారాలు సేకరించడంలో యాక్టివ్‌గా పనిచేస్తోంది. నిందితుల కాల్ రికార్డులు, ఫోన్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ వంటి ఆధారాలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా, దాడి జరిగిన మరుసటి రోజు ఉదయం మనోజిత్ మిశ్రా కాలేజీ వైస్ ప్రిన్సిపల్ నయనా చటర్జీతో ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం రావడంతో ఆమెను రెండు సార్లు విచారించారు. ఇక సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడు జైబ్ అహ్మద్ ఒక మెడికల్ షాపులో ఇన్‌హేలర్ కొనుగోలు చేస్తున్న దృశ్యం రికార్డైంది. బాధితురాలు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా కేవలం ఇన్‌హేలర్ ఇచ్చారని చెప్పిన విషయం ఫుటేజ్ ద్వారా ధృవీకరించబడింది. దీనితోపాటు వైద్య నివేదికలు, మొబైల్ డేటా, కాల్ రికార్డులు అన్ని బాధితురాలి వాంగ్మూలానికి పూర్తి స్థాయిలో సమానంగా ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ ఘటన విద్యార్థి లోకాన్ని తీవ్రంగా ఉద్రిక్తానికి గురిచేసింది. సౌత్ కలకత్తా లా కాలేజీతోపాటు సమీప విద్యాసంస్థల విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. కాలేజీ భద్రతను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ గరియాహత్ క్రాసింగ్ వరకు ర్యాలీ నిర్వహించారు. భద్రత కోసం కాలేజీలో చేరాం, కానీ మాకు శాపంగా మారింది అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై నిరసనల వేళ కోర్టులో హాజరు కోసం వర్చువల్ పద్ధతిని అవలంబించారు. నిందితుల తరఫున న్యాయవాదులు వాదించరాదని బీజేపీ లీగల్ సెల్ సభ్యులు కోర్టుకు వినతిపత్రం అందజేశారు. కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని, మరింత మంది సాక్షులను పోలీసులు విచారించనున్నారని వెల్లడించారు.
Read Also: Ola-Uber : ఉబర్ , ఓలా వంటి సంస్థలకు కేంద్రం గుడ్‌న్యూస్