Site icon HashtagU Telugu

Inspiration Story: బిడ్డను వీపున కట్టుకుని వీధులు శుభ్రం చేస్తున్న లక్ష్మి.. ఓ తల్లి దీన గాథ!

Lady

Lady

అమ్మను మించిన దైవం ఈ ప్రపంచంలో లేనే లేదు. అందుకే ఆనాడు వీపున తన బిడ్డను కట్టుకుని బ్రిటీషర్లతో పోరాటం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయిని దేశమంతా ఆరాధిస్తుంది. ఆమె ధైర్యసాహసాలకు వినమ్రంగా నమస్కరిస్తుంది. ఆమె తల్లి ప్రేమకు శిరస్సు వంచి అభివందనం చెప్పింది. ఇప్పుడు ఒడిశాలో అలాంటి అమ్మ ఒకరు దర్శనమిచ్చారు. ఆమె పేరు లక్ష్మి. ఈవిడ కూడా వీపున తన చంటి బిడ్డను కట్టుకుని వీధులను శుభ్రం చేస్తోంది. ఇప్పుడీవిడ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

లక్ష్మీ ముఖి పేరు చెబితే ఎక్కువమంది గుర్తుపట్టకపోవచ్చు కాని.. బిడ్డను వీపున కట్టుకుని వీధులు ఊడుస్తున్న ఆమె ఫోటోను చూపిస్తే మాత్రం చేతులెత్తి నమస్కరిస్తారు. ఒడిశాలోని మయూర్ భంజ్ బర్దిపాడా మున్సిపాలిటీలో గత పదేళ్లుగా ఆమె స్వీపర్ ఉద్యోగం చేస్తోంది. అప్పుడే ఓ దినసరి కూలీకి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ ఆమె భర్త తాగుడుకు అలవాటుపడ్డాడు. తరువాత వీరికి ఓ బిడ్డ పుట్టింది. ఓ సందర్భంలో ఆ బిడ్డను అమ్మేయడానికి అతడు ప్రయత్నించాడు. దీంతో లక్ష్మి తన భర్తను ఎదురించి ఆ బిడ్డను కాపాడుకుంది. అప్పుడే భర్త నుంచి వేరుపడింది. అదే ఊళ్లో ఓ ఇంట్లో తన బిడ్డతోపాటు నివసిస్తోంది.

ఇంట్లో బిడ్డను ఉంచాలంటే.. తనకు తోడు ఎవరూ లేరు. అందుకే వేరే దారిలేక బిడ్డను తన వీపు వెనుక కట్టుకుని ఉద్యోగం చేస్తోంది. ఆమెది స్వీపర్ ఉద్యోగం కావడం.. ఎండనకా, వాననకా కష్టపడి పనిచేయాల్సి రావడంతో.. తన బిడ్డ ఆరోగ్యంపై ఆందోళన చెందుతోంది. అయినా వేరే దారిలేక అలాగే పనిచేసుకుంటోంది. బిడ్డను వీపున కట్టుకుని పనిచేయడం ఇబ్బందిగా లేదా అంటే అదేం లేదని నవ్వుతూ చెబుతుంది.

బర్దిపాడా మున్సిపాల్టీ ఛైర్మన్ బాదల్ మోహంతి మాత్రం కొంత మానవత్వంతో స్పందించారు. లక్ష్మి వ్యక్తిగత కారణాలతో బిడ్డను తనతోపాటు తెచ్చుకుంటోందని.. అందుకే ఆమెకు అవసరమైన సాయం చేయాలని ఆమె తోటి ఉద్యోగులకు చెప్పామన్నారు. లక్ష్మి తల్లి ప్రేమకు నెటిజన్లు ఫిదా అయ్యారు. నవమాసాలు మోసి కన్న బిడ్డను.. ఇప్పుడు వీపున కట్టుకోవడం ఏమాత్రం బరువు కాదని.. పేగుబంధం అంటే అదే అని ఆమెకు హ్యా్ట్సాఫ్ చెబుతున్నారు.

Exit mobile version