BRS Leader Patnam Narender Reddy Arrest : బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని లగచర్ల ఘటనలో ప్రమేయం ఉందనే అరోపణలతో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే నరేందర్ రెడ్డి అరెస్టును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్‌ఎస్‌కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలతో మాట్లాడినా నేతలను అదుపులోకి తీసుకుంటున్నారన్నారు. ప్రజా తిరుగుబాటు అణచివేతకు అప్రజాస్వామిక చర్యలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు.
తమను భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందన్నారు. రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై పోరాటం కొనసాగుతుంది. ఎంత అణచివేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం అని కేటీఆర్ పోస్ట్ పెట్టారు. అయితే బీఆర్‌ఎస్ ఉద్యమకాలం నుండి ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్టులను ఎన్నో చూసిందని కేటీఆర్ తెలిపారు. ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామని తెలిపారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కూడా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడాన్ని ఖండించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. పాలన గాలికి వదిలి అక్రమ కేసులతో రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెట్టడమేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులతో అణచివేయలేరన్నారు. అర్ధరాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్భందిచడమే ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హరీశ్‌రావు పేర్కొన్నారు.