KP Sharma Oli: నేపాల్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. కొత్త ప్రధాన మంత్రిగా కేపీ శర్మ ఓలీ ఈరోజు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 22 మంది మంత్రులు ప్రమాణం చేశారు. కాగా, నేపాల్ ప్రధానిగా ఓలీ బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం. అంతకుముందు ప్రధానిగా ఉన్న పుష్పకమల్ దహల్ అలియాన్ ప్రచండ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవలే కుప్పకూలింది.
KP Sharma Oli sworn in as Prime Minister of Nepal for the fourth time
(file pic) pic.twitter.com/avl8QcZ0fJ
— ANI (@ANI) July 15, 2024
శుక్రవారం ప్రజా ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ప్రధాని పుష్పకుమార్ దహల్ ప్రచండ ఓడిపోయారు. 275 సీట్లున్న సభలో విశ్వాస తీర్మానం నెగ్గడానికి 138 సీట్లు కావాల్సి ఉండగా.. ప్రచండకు అనుకూలంగా 63 సీట్లు మాత్రమే వచ్చాయి. 194 ఓట్లు వ్యతిరేకంగా పడటంతో ప్రచండ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. దీంతో నేపాల్-యునైటెడ్ మార్క్సి స్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-యూఎంఎల్), నేపాల్ కాంగ్రెస్ (ఎన్‌సీ)లతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో కొత్త ప్రధానిగా ఓలిని అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ ఆదివారం నియమించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఓలి నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్, మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్ (ఎన్‌సీ) కూటమి మధ్య కొన్ని రోజుల క్రితమే అధికారం పంచుకోవడంపై ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం.. తొలి 18 నెలలు ఓలి ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసే వరకూ దేవ్‌బా ప్రధానిగా కొనసాగుతారు. కాగా, ఓలి గతంలో మూడుసార్లు నేపాల్ ప్రధానిగా పనిచేశారు. 2015 (అక్టోబర్ 11) – 2016 (ఆగస్టు 3), 2018 (ఫిబ్రవరి 5)-2021 (జులై 13), ఆ తర్వాత కూడా కొన్ని రోజులు ప్రధానిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగోసారి అధికారం చేపట్టారు.
మరోవైపు , నేపాల్ నూతన ప్రధాని కేపీ శర్మ ఓలీకి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఎక్స్ వేదికగా మోడీ ఓ పోస్ట్ పెట్టారు. నేపాల్ ప్రధాన మంత్రిగా నియమితులైన ఓలీకి అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య స్నేహ బంధాలను మరింత బలోపేతం చేయడం, సమష్టి ప్రయోజనాలను కాపాడుకోవడానికి పరస్పర సహకారంతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.