Rape threats to women lawyers : సుప్రీంకోర్టులో ఈరోజు మరోసారి కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనపై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో బెంగాల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న మహిళా న్యాయవాదులకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు వెల్లడించారు.
Read Also: Delhi New CM: కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం అతిషి బాధ్యత
నా ఛాంబర్‌లో మహిళలకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయి. వారిపై యాసిడ్ పోస్తామని, అత్యాచారం చేస్తామని కొందరు సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెడుతున్నారు” అని సిబల్ న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ మహిళా న్యాయవాదుల భద్రతకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. హత్యాచారం కేసులో కోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేయాలని సిబల్ అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే లైవ్ స్ట్రీమింగ్‌ను నిలిపివేయడానికి బెంచ్ నిరాకరించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విచారణను ప్రసారం చేస్తున్నట్లు పేర్కొంది.
అనంతరం ఈ కేసుకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్‌ను సీబీఐ కోర్టుకు సమర్పించింది. దానిలో పేర్కొన్న విషయాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని న్యాయస్థానం ఆందోళన వ్యక్తంచేసింది. ఇప్పటివరకు గుర్తించిన వివరాలను బయటపెట్టడం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడొచ్చని పేర్కొంది. వాస్తవాలను వెలికితీయడం దర్యాప్తు లక్ష్యమని వెల్లడించింది. ప్రిన్సిపల్, స్టేషన్ హౌస్ ఆఫీసర్(SHO)ను అరెస్టు చేశారని, దర్యాప్తు పూర్తయ్యేవరకు వేచిచూద్దామని తెలిపింది.