Tahawwur Rana : ముంబైను శోకసంద్రంగా మలిచిన 26/11 ఉగ్రదాడుల కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తింపు పొందిన తహవ్వుర్ హుస్సేన్ రాణా విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలో ఉన్న రాణాను అధికారులు ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రాణా విచారణలో కొన్ని కీలక అంశాలను అంగీకరించినట్లు సమాచారం. తహవ్వుర్ రాణా తనను తాను పాకిస్థాన్ సైన్యం నమ్మిన గూఢచారి అని చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ముంబై దాడుల ప్రధాన కుట్రకర్త డేవిడ్ కోల్‌మాన్ హెడ్లీతో తన సన్నిహిత సంబంధాలను కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి ముంబైపై ఉగ్రదాడికి పథకం రచించినట్టు తెలుస్తోంది. తాహవ్వుర్‌తో పాటు హెడ్లీకి పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయని కూడా రాణా అంగీకరించినట్టు తెలుస్తోంది.
Read Also: B. R. Gavai: న్యాయ సిద్ధాంతం పై జస్టిస్ బీఆర్ గవాయి ఆసక్తికర వ్యాఖ్యలు
రాణా వివరణ ప్రకారం, లష్కరే తోయిబా కేవలం ఉగ్రవాద సంస్థ కాదు, ఒక పెద్ద గూఢచారి నెట్‌వర్క్ లా పని చేస్తుందని ఎన్‌ఐఏకి తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, దాడుల వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్ర మోహాలు మరోసారి బయటపడుతున్నాయి. తహవ్వుర్ రాణా పాకిస్థాన్ సంతతికి చెందిన వ్యక్తి కాగా, కెనడా పౌరుడిగా గుర్తింపు పొందాడు. అమెరికాలో నివసిస్తున్న అతను ముంబై దాడుల అనంతరం అక్కడికి పారిపోయాడు. అయితే, 2009లో అమెరికా అధికారులు అతన్ని అరెస్టు చేసి, అక్కడి జైలులో శిక్ష అనుభవించేటట్లు చేశారు. ఇటీవలే భారత్ చేసిన అభ్యర్థన మేరకు, అమెరికా ప్రభుత్వం రాణాను భారత్‌కు అప్పగించింది. అప్పటి నుంచి అతడు ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నాడు.
2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి దేశ చరిత్రలోనే భయానక ఘట్టంగా నిలిచిపోయింది. సముద్ర మార్గం ద్వారా భారతదేశంలోకి అక్రమంగా చొరబడిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలోని తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినస్, నారిమన్ హౌస్ వంటి ప్రాంతాల్లో నరమేథం సృష్టించారు. ఈ దాడులు మొత్తం 60 గంటల పాటు సాగి, మొత్తం 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పలు దేశాలకు చెందిన విదేశీయులు, భారత భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న 10 మంది ఉగ్రవాదుల్లో 9 మందిని భారత భద్రతా దళాలు ఎదిరించి హతమర్చాయి. కసబ్ అనే ఉగ్రవాది మాత్రమే ప్రాణాలతో పట్టుబడగా, అతనికి తరువాత న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. తహవ్వుర్ రాణా నుండి ఎన్‌ఐఏ సేకరిస్తున్న సమాచారం ఆధారంగా మరిన్ని అంతర్గత వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు అంతర్జాతీయ ఉగ్ర ముఠాల గూఢచర్యం, నిధుల సరఫరా, భవిష్యత్ కుట్రలు వంటి అంశాలపై మరింత లోతుగా పరిశీలిస్తున్నాయి.