Site icon HashtagU Telugu

Naxalism : న‌క్స‌ల్స్ ర‌హిత భార‌త్ దిశ‌గా కీల‌క అడుగు : అమిత్‌ షా

Key step towards Naxal-free India: Amit Shah

Key step towards Naxal-free India: Amit Shah

Naxalism : ఛత్తీస్‌ఘ‌డ్‌లోని గ‌రియాబంద్ జిల్లాలో ఈరోజు జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 14 మంది నక్స‌లేట్లు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. న‌క్స‌లిజానికి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింద‌న్నారు. న‌క్స‌ల్స్ ర‌హిత భార‌త్ దిశ‌గా కీల‌క అడుగు ప‌డింద‌న్నారు. మ‌న భ‌ద్ర‌తా ద‌ళాల‌కు ఇది గొప్ప విజ‌యమ‌న్నారు. ఒడిశా-చ‌త్తీస్‌ఘ‌డ్ స‌రిహ‌ద్దుల్లో.. సీఆర్పీఎఫ్‌, ఎస్ఓజీ ఒడివా, ఛత్తీస్‌ఘ‌డ్ పోలీసులు 14 మంది న‌క్స‌ల్స్‌ను జాయింట్ ఆప‌రేష‌న్ ద్వారా మ‌ట్టుబెట్టార‌ని, న‌క‌ల్స్ ర‌హిత్ భార‌త్ ల‌క్ష్యంగా భ‌ద్ర‌తా ద‌ళాలు చేప‌ట్టిన సంయుక్త ఆప‌రేష‌న్‌తో న‌క్స‌లిజం కొన ఊపిరితో ఉన్న‌ట్లు కేంద్ర మంత్రి షా పేర్కొన్నారు.

ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందిన వారిలో మావోయిస్టు సెంట్ర‌ల్ క‌మిటీ నేత జ‌య‌రాం అలియాస్ చ‌ల‌ప‌తి కూడా ఉన్నారు. అయితే చ‌ల‌ప‌తిపై కోటి రూపాయ‌ల న‌జ‌రానా ఉన్న‌ట్లు గ‌రియాబంద్ ఎస్పీ నిఖిల్ ర‌కీచా తెలిపారు. ఎన్‌కౌంట‌ర్‌లో ప్రాణాలు కోల్పోయిన న‌క్స‌ల్స్ మృత‌దేహాల‌ను గుర్తిస్తున్న‌ట్లు చెప్పారు. ఇంటెలిజెన్స్ స‌మాచారం ఆధారంగా జ‌న‌వ‌రి 19వ తేదీన కుల‌రీఘాట్ రిజ‌ర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో సెర్చ్ ఆప‌రేష‌న్ మొద‌లైంద‌న్నారు. సోమ‌వారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ ప్ర‌దేశం నుంచి భారీ స్థాయిలో ఫైర్ఆర్మ్స్‌, అమ్యూనిష‌న్, ఐఈడీలు, సెల్ఫ్ లోడింగ్ రైఫిళ్లు రిక‌వ‌రీ చేసిన‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో ఇంకా ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయ‌ని, మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఏడాది ఛతీస్‌ఘ‌డ్‌లో 40 మంది న‌క్స‌ల్స్ మృతిచెందారు. బీజాపూర్ జిల్లాలో జ‌న‌వ‌రి 16వ తేదీన జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 12 మంది న‌క్స‌ల్స్ మృతిచెందిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని భ‌ద్ర‌తా ద‌ళాలు వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో 219 మంది న‌క్స‌ల్స్‌ను హ‌త‌మార్చాయి. కాగా, చ‌త్తీస్‌ఘ‌డ్ సీఎం విష్ణు దేవ్ సాయి భ‌ద్ర‌తా ద‌ళాల‌ను ప్ర‌శంసించారు. 2026 మార్చి నాటికి చ‌త్తీస్‌ఘ‌డ్ నుంచి న‌క్స‌లిజాన్ని త‌రిమివేయ‌నున్న‌ట్లు చెప్పారు. సైనికుల సాధించిన విజ‌యం అద్భుత‌మ‌ని, వారి సాహ‌సానికి సెల్యూట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇక, సోమ‌వారం రాత్రి, మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున .. మెయిన్‌పుర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 12 మంది మృతిచెందారు. దీంతో న‌క్స‌ల్స్ మృతుల సంఖ్య 14కు చేరిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

Read Also: Boxoffice : బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’