Kejriwal successor is Atishi ..?: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ వారసులెవరనే ఓ చర్చ అయితే సర్వత్ర జరుగుతుంది. అరవింద్ కేజ్రీవాల్ వారసురాలు అతిషినే అని ఓ ప్రచారం అయితే సాగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రకటిస్తారనే చర్చ సైతం నడుస్తుంది.
పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలో సైతం అతిషి కీలకం..
2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపులో ఆమె కీలకంగా వ్యవహరించారు. అలాగే పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో అతిషి తనదైన ముద్ర వేశారు. దీంతో పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలో సైతం అతిషి కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేజ్రీవాల్ కేబినెట్‌లో అత్యధిక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న ఒకే ఒక్క మంత్రి అతిషి. ఆమె అజమాయిషీలో 11 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. దీంతో పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా అతిషి ఉన్నారని సుస్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎంగా అతిషిని ఎంపిక చేస్తారని ఊహాగానాలు ఊపందుకోన్నాయి. ఇటీవల జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తాను జైల్లో ఉన్నానని.. ఈ నేపథ్యంలో త్రివర్ణ పతాకాన్ని అతిషి ఎగురవేస్తుందంటూ సీఎం కేజ్రీవాల్.. న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సెనాకు లేఖ సైతం రాసిన సంగతి తెలిసిందే. కానీ ఆ అవకాశాన్ని కేజ్రీవాల్ కేబినెట్‌లోని మరో మంత్రికి కల్పిస్తూ.. ఢిల్లీ ఎల్జీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన అనంతరం స్పందించిన అతిషి…
కేజ్రీవాల్ రాజీనామా అనంతరం అతిషి స్పందిస్తూ.. బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. బీజేపీ ఎన్నికలకు భయపడుతుందని విమర్శించారు. అందుకే ఆప్ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తుందని మండిపడ్డారు. ఆప్ నేతలను అరెస్ట్ చేసిన కేసుల్లో ఒక్క ఆధారాన్ని సైతం బీజేపీ చూపించలేక పోయిందని గుర్తు చేశారు.
అందుకే ఢిల్లీ ప్రజలు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో పడతాయని స్పష్టం చేశారు. ఇక సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జార్ఖండ్, మహారాష్ట్రతోపాటు నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.