తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ రాజకీయ సంక్షోభం ఛాయలు అలముకుంటున్నాయి. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఆయన కలిశారు. ఇప్పుడు ఎక్సైజ్ పాలసీ స్కామ్ బయటకు వచ్చింది. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు కల్వకుంట్ల కుటుంబ సభ్యుల ప్రమేయంపై సీబీఐ ఆరా తీస్తోంది. ఆ మేరకు కేసులు కూడా నమోదు అయినట్టు పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ , బీజేపీ మాజీ ఎమ్మెల్యే మజీందర్ సింగ్ సర్సా చెబుతున్నారు. అంతేకాదు, పంజాబ్ వరకు ఎక్సైజ్ స్కామ్ లింకులు ఉన్నాయని సీబీఐ ప్రాథమికంగా అనుమానిస్తోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్కామ్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నారని అనుమానిస్తూ విచారణ కొనసాగుతోంది.
మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ థాకరే ఉన్నప్పుడు కేసీఆర్ అక్కడికి వెళ్లారు. ఆయన భేటీ నిర్వహించిన వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే థాకరేకు కష్టాలు మొదలయ్యాయి. అంతిమంగా సీఎం పదవిని కోల్పోయారు. అక్కడ ఏక్ నాథ్ షిండే ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. కర్నాటక రాష్ట్రానికి పలుమార్లు వెళ్లిన కేసీఆర్ అప్పట్లో సీఎంగా ఉన్న కుమారస్వామిని కలిశారు. ఆనాటి నుంచి ఆయనకు ఇక్కట్లు ప్రారంభం అయ్యాయి. సీన్ కట్ చేస్తే, కర్నాటక సీఎం పదవిని కుమారస్వామి వదులుకున్నారు. ఆయన స్థానంలో యడుయూరప్ప సీఎం అయ్యారు. ఆశీస్సుల కోసం త్రిదండి చిన్న చియ్యర్ వద్దకు యడ్డీ వచ్చారు. ఆ సందర్భంగా కేసీఆర్ తో మాటలు కలిపారు. అంతే, ఆ తరువాత బీజేపీ అధిష్టానం చేసిన మార్పులో భాగంగా సీఎం పదవి ఆయనకు పోయింది. ప్రస్తుతం బొమ్మై సీఎంగా కర్నాటకలో ఉన్నారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పలుమార్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ కు రెండుసార్లు హేమంత్ వస్తే, ఒకసారి కేసీఆర్ జార్ఖండ్ కు వెళ్లారు. అప్పటి నుంచి హేమంత్ చేస్తోన్న మైనింగ్ వ్యాపారాలు, మనీల్యాండరింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. ఈడీ దాడులు నిర్వహించడం ద్వారా మనీల్యాండరింగ్ కు సంబంధించిన మూలాలు బయటపడ్డాయి. ఆయనతో పాటు అధికార, అనధికార వ్యక్తులు 15 మందిపై ఈడీ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. బీహార్ రాజకీయాలను సీఎం కేసీఆర్ కదిలించారు. ఆ రాష్ట్రానికి చెందిన ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ ను కలుసుకున్నారు. సీఎం టార్గెట్ గా రాజకీయాలు చేస్తోన్న తేజస్వీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది.
బీజేపీ, జేడీయూ కూటమి పడిపోయిన తరువాత సీఎంగా తేజస్వి అయ్యే అవకాశం ఉండేది. కానీ, అక్కడ మారిన రాజకీయాల దృష్ట్యా జేడీయూ, ఆర్జేడీ చేతులు కలిపింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆర్జేడీకి ఉన్నప్పటికీ తేజస్వి సీఎం కాలేకపోయారు. తాజాగా ఏర్పడిన కొత్త కూటమికి మళ్లీ నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. దీంతో తేజస్వి గ్రాఫ్ అక్కడ క్రమంగా మసకబారే పరిస్థితి ఏర్పడింది. బెంగాల్ సీఎం మమతను ఆ రాష్ట్ర ఎన్నికలకు ముందుగా కేసీఆర్ కలిశారు. ఆ తరువాత మళ్లీ కలవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కేసీఆర్ కు ఆమె అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. అధికారంలోకి టీఎంసీ వచ్చినప్పటికీ మమత మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్లీ ఆమె ఎన్నికల్లో పోటీ చేసిన గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు, అక్కడ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏదో ఒక స్కామ్ లో ఇరుక్కుంటోంది.
2009 నుంచి 2018 వరకు చంద్రబాబుతో చట్టాపట్టాల్ వేసుకుని కేసీఆర్ తిరిగారు. సీన్ కట్ చేస్తే, చంద్రబాబు ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీతో పాటు చంద్రబాబు కూడా ఎదురు ఈదుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడమే కాదు, ఆ పార్టీతో కలిసి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు వెళ్లారు. అంతే, సోనియా, రాహుల్ నిరంతరం ఈడీ విచారణ వెంటాడుతోంది. ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక సీఎం స్థాలిన్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కు దూరంగా ఉంటున్నారు. బహుశా సెంటిమెంట్ ను గుర్తు చేసుకుని దూరంగా ఉంటున్నారా? లేక ఆయన తో జట్టుకట్టేందుకు ఇష్టంలేక నైస్ గా తప్పుకుంటున్నారా? అనేది తరచూ చర్చ జరుగుతూనే ఉంది. ఆయా రాష్ట్రాల్లో కేసీఆర్ కలిసి వచ్చిన తరువాత జరిగిన సంఘటనలను గుర్తు చేస్తోన్న ప్రత్యర్థులు మాత్రం ఆయన పాదం ( ఐరన్ లెగ్)మీద సెంటిమెంట్ ను వినిపిస్తున్నారు. కేసీఆర్ ఎక్కడకు వెళితే అక్కడ అధికారం ఔట్ అంటూ ప్రచారం మొదలైయింది. ఇలాంటి `ఐరెన్ లెగ్` ముంద్ర ముదరకముందే కేసీఆర్ ఎలా ప్రత్యర్థుల నోళ్లు మూయిస్తారో చూడాలి.