Site icon HashtagU Telugu

Etela Rajender : కాళేశ్వరం నోటీసులు..కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వివరిస్తా : ఈటల రాజేందర్

kaleshwaram-notices-i-will-explain-what-happened-during-kcr-rule-etela-rajender

kaleshwaram-notices-i-will-explain-what-happened-during-kcr-rule-etela-rajender

Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులపై బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. తాను నోటీసులకు భయపడేది లేదని, అవసరమైతే కేసీఆర్ పాలనలో జరిగిన నిజాలను బయటపెడతానని ఆయన స్పష్టం చేశారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌తో మాట్లాడిన ఈటల, పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఈటల మాట్లాడుతూ.. “కమిషన్ నుంచి నోటీసులు వచ్చినా నేను భయపడను. కేసీఆర్ హయాంలో జరిగిన అన్ని విషయాలు నాకు తెలుసు. అవసరమైతే వాటిని బహిర్గతం చేస్తాను. ఈ నోటీసుల ద్వారా నన్ను భయపెట్టాలని చూస్తే తప్పు. నిజానికి కేసీఆర్ పాలనలో ఎంతమందికి ఎలాంటి పాత్రలు ఉన్నాయో నన్ను మించిన వారే ఉన్నారు” అని ధీటుగా చెప్పారు.

Read Also: National Herald case : రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

తమతో పాటు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి వంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారన్న ఈటల, “వాళ్లకు అప్పటి పరిస్థితులు తెలియవా? వాళ్లే ఇప్పుడు సీఎంతో కలిసి ఉన్నారు. అప్పట్లో జరిగిన అవకతవకల గురించి సీఎం రేవంత్ రెడ్డికి వివరించడం వారి బాధ్యత” అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావే ప్రస్తుతం రాష్ట్ర సీఎస్‌గా ఉన్నారని ఈటల గుర్తు చేశారు. “ఆ రోజుల్లో కేసీఆర్‌కు ఎదురుగా ఎవరూ నిలబడలేని పరిస్థితుల్లో నేను ఆరు నెలల పాటు పోరాటం చేశాను. తెలంగాణ సమాజం ఆ విషయాన్ని గమనించింది. అలాంటి నేను ఇప్పుడు నోటీసులకే వెనకడుగేస్తానని భావించడం తప్పుడు అంచనా,” అన్నారు.

విచారణ కమిషన్ నుంచి తనకు ఇప్పటివరకు అధికారికంగా నోటీసులు రాలేదని, వచ్చిన తర్వాత పార్టీ అనుమతితో స్పందిస్తానని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో తాను, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నట్టు పేర్కొన్నారు. ఆ కమిటీ కొనసాగుతున్న సమయంలోనే తెర వెనుక జరిగిన పరిణామాలను త్వరలో మీడియాకు వెల్లడిస్తానని వెల్లడించారు. “ఇంజినీర్లు సీఎంకు అనుసరిస్తూ ప్రాజెక్టు నిర్మాణాలు చేశారు. ఇప్పుడు మంత్రుల నిర్ణయాలపై విచారణ చేస్తామంటే న్యాయమేనా?” అంటూ ఈటల ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విచారణను తన రాజకీయ లక్ష్యాల కోసం వాడుకుంటున్నారేమోనన్న అనుమానాన్ని ఈటల వ్యక్తం చేశారు. “వాస్తవంగా ప్రజల ప్రయోజనాల కోసమే ఈ కమిషన్ ఏర్పాటు చేశారా? లేక రాజకీయం కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?” అని ధ్వజమెత్తారు. విచారణ కమిషన్ గడువు పదేపదే ఎందుకు పెంచుతున్నారు? దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరగా, తనపై నోటీసులు జారీ చేయడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి అభాసుపాలవుతారని ఈటల రాజేందర్ హెచ్చరించారు.

Read Also: Mohanlal Biography: బర్త్‌డే వేళ మోహన్‌లాల్‌ కీలక ప్రకటన.. జీవిత చరిత్రపై పుస్తకం