MLC Kavitha: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు.. జూన్‌ 4న కవిత నిరసన

ఈ నేపథ్యంలో, జూన్ 4న హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.

Published By: HashtagU Telugu Desk
MLC Kavitha

MLC Kavitha

MLC Kavitha: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన కమిషన్‌ నోటీసులను తీవ్రంగా ఖండిస్తూ ఆయన కుమార్తె, మాజీ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ నోటీసులు కేవలం రాజకీయ ప్రేరితంగా ఉన్నాయని, ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నమని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో, జూన్ 4న హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం కృషి చేసిన నేతలపై తప్పుడు ఆరోపణలతో నోటీసులు ఇవ్వడం తగదు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే గర్వకారణంగా నిలిచింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని కేసీఆర్‌ గారిపై కుట్రలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ. దీని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశ్యాలపై ప్రజలు స్పష్టంగా తెలుసుకోవాలి అంటూ కవిత విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చేపట్టిన అతి పెద్ద నీటి ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి ప్రాజెక్టుపై దర్యాప్తులు జరపడం, నోటీసులు పంపడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనిపై సమగ్రంగా స్పందించేందుకు తెలంగాణ జాగృతి సంస్థ ముందుకొచ్చింది. జూన్ 4న ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ నిరసన కార్యక్రమానికి విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరుకావాలని జాగృతి కోరుతోంది. ఇంకా, శనివారం (ఈరోజు) సాయంత్రం 5 గంటలకు హైదరాబాదు బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి సంస్థ తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు హాజరుకానున్నారు. కార్యాలయ ప్రారంభంతో పాటు సంస్థ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు చేసిన సేవా కార్యక్రమాలను ఫోటో ప్రదర్శనగా ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. తెలంగాణ అభివృద్ధికి నడుం కట్టిన నాయకులపై ఇటువంటి కుట్రలు చూస్తూ కూర్చోవద్దు. ప్రజల మద్దతుతోనే ఈ కుట్రలను ఎదుర్కొనాలి అని కవిత అన్నారు. ఆమె ప్రతి తెలంగాణ వాసి ఈ పోరాటంలో భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేశారు.

Read Also: Amazon : జూన్ 1 నుండి 5 వరకు అమెజాన్ హోమ్ షాపింగ్..అద్భుతమైన ఆఫర్లు

  Last Updated: 31 May 2025, 05:20 PM IST