Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)ని మరోసారి పొడిగిస్తూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో సహా మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని సైతం పొడిగించింది.
We’re now on WhatsApp. Click to Join.
రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో వారికి ఈ నెల 31 వరకు రిమాండ్‌ను పొడిగించింది. మరోవైపు సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన కేసులో వాదనలు విన్న కోర్టు ఆగస్టు 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కవితను జైలు అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు.
సీబీఐ కేసు(CBI case)లో డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత వేసిన పిటిషన్ పై జులై 22న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది. విచారణలో భాగంగా కవితపై సీబీఐ వేసిన ఛార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. జులై 26న కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపర్చాలని సీబీఐని ఆదేశించగా ఈ రోజు కవితను హాజరు పరిచారు. కవిత సహా మరో నలుగురి పాత్రపై జూన్ 7న సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
కాగా, కేసీఆర్(KCR) మొదటి సారిగా కవిత అరెస్ట్ పై గురువారం స్పందించారు. కుట్ర చేసి తన కూతురిని అరెస్ట్ చేశారని.. దీనిపై సరైన సమయంలో స్పందిస్తా అని పేర్కొన్నారు. మరోవైపు మీ కూతురు తప్పు చేయకపోతే ఇన్ని రోజులు జైలులో ఎందుకుంటుందని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లి 100 రోజులు దాటిపోయింది. కొద్ది రోజుల క్రితం ఆమె స్వల్ప అస్వస్థకు గురైతే ఆస్పత్రిలో చికిత్స చేయించి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
