100 Websites Blocked : టాస్క్ ఆధారిత పార్ట్ టైమ్ జాబ్స్, పెట్టుబడుల సేకరణ పేరుతో ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్న 100కిపైగా అనధికారిక వెబ్‌సైట్‌లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. కేంద్ర హోం శాఖ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఐటీ చట్టం-2000 ప్రకారం ఆయా వెబ్‌సైట్‌లను బ్లాక్ చేశామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ వెబ్‌సైట్‌లను విదేశాలకు చెందినవారు నిర్వహిస్తున్నారని తెలిపింది. కేంద్ర హోం శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తన వర్టికల్ నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (ఎన్సీటీఏయూ) ద్వారా ఈ 100కిపైగా వెబ్‌సైట్‌లను ఇటీవల గుర్తించారు. వాటిని బ్లాక్ చేయాలని హోం శాఖ చేసిన సిఫార్సు మేరకు కేంద్ర ఐటీ శాఖ తాజా చర్యలు తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ వెబ్‌సైట్లు కార్డ్ నెట్ వర్క్, క్రిఫ్టో కరెన్సీ, అంతర్జాతీయ ఫిన్ టెక్ కంపెనీలను ఉపయోగించి పెద్ద ఎత్తున ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. భారత్ నుంచి వచ్చే ఆదాయాన్ని మనీ లాండరింగ్ చేస్తున్నాయని పేర్కొంది. ఈ వెబ్‌సైట్ల ఆర్ధిక నేరాలకు సంబంధించి 1930 హెల్ప్ లైన్‌తో పాటు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా అనేక ఫిర్యాదులు అందాయని వివరించింది. ఈ రకమైన నేరాలతో భారతీయులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర హోంశాఖ చెప్పింది.
Also Read: Cow Urine : దేశాన్ని గోమూత్రంతో శుద్ధి చేస్తాం.. స్వామి చక్రపాణి మహారాజ్ వ్యాఖ్యలు
వర్క్ ఫ్రమ్ హోం పేరుతో నిరుద్యోగులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులను ఆకర్షించి ఈ వెబ్‌సైట్లు మోసాలకు పాల్పడుతున్నాయని కేంద్ర హోం శాఖ నివేదించింది. ఈ ఫేక్ వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లో యాడ్స్ నడుపుతున్నాయని.. ఆ యాడ్స్‌పై ఒక్కసారి క్లిక్ చేస్తే వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియాలో ఈ వెబ్ సైట్‌లకు చెందిన ఏజెంట్లు మాట్లాడుతున్నారని ఆ నివేదికలో ప్రస్తావించారు. ఆసక్తి కనబరిచే వారికి ఫోన్ చేసి.. చిన్న టాస్క్ లను చేస్తే రోజుకు వేలాది రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుందని చెబుతారు. తొలుత కమీషన్ రూపంలో నగదును అందిస్తారు. పెట్టుబడి పెడితే .. వర్క్ చేసినందుకు ఇంకా పెద్ద ఎత్తున కమీషన్ వస్తుందని ఆశ చూపుతారు. ఇలా పెట్టుబడి పెట్టిన వారంతా మోసపోతున్నారని కేంద్ర హోంశాఖ(100 Websites Blocked) ప్రకటించింది.