Vijay Barsi: స్లమ్స్ టు సాకర్.. ‘బిగ్ బీ’ మెచ్చిన విజయ్ బర్సే!

తరచిచూడాలే కానీ.. మట్టిలోనూ మాణిక్యాలుంటారు. సరైన ప్రోత్సాహం, గైడెన్స్ ఇస్తే చాలు.. ఏ రంగంలోనైనా రాణిస్తారు. అందుకు ఉదాహరణే అమితాబ్ నటించిన ‘ఝండ్’ సినిమా.

  • Written By:
  • Updated On - March 5, 2022 / 12:12 PM IST

తరచిచూడాలే కానీ.. మట్టిలోనూ మాణిక్యాలుంటారు. సరైన ప్రోత్సాహం, గైడెన్స్ ఇస్తే చాలు.. ఏ రంగంలోనైనా రాణిస్తారు. అందుకు ఉదాహరణే అమితాబ్ నటించిన ‘ఝండ్’ సినిమా. ఈ సినిమాకు ప్రేరణ విజయ్ బర్సే. ఆయన మురికివాడల పిల్లల్లో ప్రతిభను వెలికితీసి మట్టిల్లో మాణిక్యాలను వెలికితీశారు. పేద పిల్లలను ఫుట్ బాల్ ప్రపంచానికి పరిచయం చేసి ‘ది రియల్ హీరో’ అనిపించుకున్నాడు. అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఝుండ్’ థియేటర్లలోకి సందడి చేస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రేరణ విజయ్ బార్సే కథ. నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫుట్‌బాల్ ద్వారా మురికివాడల్లో నివసించే పిల్లల జీవితాలను బార్సే ఎలా మార్చింది అనే కథను చెబుతుంది.

బార్సే ప్రయాణం 2001లో నాగ్‌పూర్‌లోని హిస్లాప్ కాలేజీలో ప్రారంభమైంది. అక్కడ ఆయన పీఈటీగా పనిచేశాడు. కొంతమంది పిల్లలకు ఫుట్ బాల్ పట్ల ఇష్టాన్ని గమనించాడు. అయితే పిల్లలు సరైన వసతులు లేక విరిగిన బకెట్, కవర్లతో చుట్టిన బంతిని తన్నుతూ ఆడటం చూశాడు. ఆట పట్ల పిల్లల ఇష్టాన్ని గమనించి, విజయ్ ఫుట్ బాల్ ను బహుమతిగా ఇచ్చాడు. ఆ పిల్లలు అంచనాలకు మించి క్రీడలో ప్రతిభ చాటారు. అప్పట్నుంచే మురికివాడ పిల్లల్లో ఆణిముత్యాలు ఉంటారని గ్రహించాడు. మురికివాడ పిల్లల కోసం మైదానాలను ఏర్పాటుచేయడంతో పాటు ఫిట్ నెస్ పాఠాలు నేర్పించాడు. మైదానాల కోసం ర్యాలీలు సైతం నిర్వహించాడు బార్సే. మురికివాడ పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక టోర్నమెంట్‌ని ఏర్పాటు చేశాడు. దాదాపు 128 జట్లు ఈవెంట్‌లో పాల్గొన్నాయి.

మురికివాడల్లో నివసించే పిల్లలకు శిక్షణ, పునరావాసం అందించే ‘సాకర్ అకాడమీ’ని ఏర్పాటు చేశాడు. దాతలు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో తన సొంత ఖర్చులను భరించాడు. ఫలితంగా నేడు 15 కంటే ఎక్కువ రాష్ట్రాల నుండి పిల్లలు ఈ సంస్థ కనెక్టై ఫుట్ బాల్ క్రీడలో రాణిస్తున్నారు. రిటైర్ మెంట్ తర్వాత NGO క్రీడా వికాస్ సంస్థ నాగ్‌పూర్ (KSVN)ని స్థాపించడానికి బార్సే రూ. 18 లక్షలు వెచ్చించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లను నిర్వహించింది. ఈ అవకాశం పేదల పిల్లలకు వరంగా మారింది. 2007లో బార్సే, అతని జట్టు దక్షిణాఫ్రికాలో జరిగే హోమ్‌లెస్ వరల్డ్ కప్‌కు ఆహ్వానించబడింది. ఇక్కడ వారికి నెల్సన్ మండేలాను కలిసే అవకాశం లభించింది. “ఆ రోజు అతను నాపై చేయి వేసి.. ‘నువ్వు గొప్ప పని చేస్తున్నావు’ అని చెప్పినప్పుడు ఎంతో ఆనందపడిపోయాను అన్నాడు బర్సె. బార్సేను 2012లో సచిన్ టెండూల్కర్ ‘రియల్ హీరో అవార్డ్’  సత్కరించారు. 2017 లో అమీర్ ఖాన్ ‘సత్యమేవ జయతే’ షోలో అతని కథ చెప్పినప్పుడు దేశవ్యాప్తంగా బర్సే పేరు మార్మోగింది.