Jagannath Rath Yatra : ఒడిశా రాష్ట్రంలోని పుణ్యక్షేత్రం పూరీలో జగన్నాథ స్వామి రథయాత్ర అద్భుతంగా, ఆధ్యాత్మిక వైభవంతో సాగుతోంది. నగర వీధులంతా “జై జగన్నాథ” నినాదాలతో మార్మోగుతున్నాయి. ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ ఆలయం నుంచి సుమారు 2.6 కి.మీ దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి వైభవంగా జరుపుతున్న ఈ రథయాత్రలో, భక్తులు స్వయంగా రథాలను లాగేందుకు పోటీ పడ్డారు. ఈ వేడుకకు ఒడిశా గవర్నర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ హాజరై, స్వయంగా రథాలను లాగారు. జగన్నాథునితో పాటు ఆయన సహోదరుడు బాలభద్రుడు, సోదరి సుభద్ర అమ్మవారి రథాలను భక్తుల సమక్షంలో ముందుకు తీసుకెళ్లారు.
Read Also: Taliban : పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 16 మంది సైనికులు మృతి
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన కుటుంబ సభ్యులతో కలిసి పూరీకి వచ్చి జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అదానీ గ్రూప్ తరఫున ‘ప్రసాద సేవ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూన్ 26 నుంచి జూలై 8, 2025 వరకు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కార్యక్రమంలో లక్షలాది భక్తులకు పోషకాహారంతో కూడిన పరిశుభ్రమైన అన్నప్రసాదాన్ని ఉచితంగా అందిస్తున్నారు. “సేవ హి సాధనా హై” అనే సిద్ధాంతానికి అనుగుణంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించబడుతోంది. పూరీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో అన్న ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, చల్లటి పానీయాల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అదానీ స్వయంగా ప్రసాద తయారీ కేంద్రాన్ని సందర్శించి, అన్నదానంలో పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా ప్రసాదాన్ని అందించి, సామాన్యుల సరసన నిలిచారు. ఈ రథయాత్రను శాంతియుతంగా, విఘ్నరహితంగా నిర్వహించేందుకు ఒడిశా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పౌరుల భద్రతకు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను అమలు చేసింది. పూరీ నగరం మొత్తం ఉత్సాహభరితంగా, భక్తి కాంతులతో కళకళలాడుతోంది. జగన్నాథుని దివ్య దర్శనంతో ముంచెత్తుతున్న ఈ రథయాత్ర, హిందూ సంప్రదాయంలో అతి ప్రముఖమైన ఉత్సవాల్లో ఒకటిగా కొనసాగుతోంది.