CM Revanth Reddy : “డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సామాజిక న్యాయ పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ఎస్సీ, ఎస్టీలకు పరిపాలనా హక్కులు లభించాయని, అదే పార్టీ వారి ఉన్నతికి పునాదులు వేసిందని పేర్కొన్నారు. “కులం వల్ల కాదు, చదువు వల్లే జీవితంలో మానవుడు ఎదుగుతాడు. ఎంతోమంది మహనీయుల జీవితాలు దీనికి నిదర్శనం. సమాజంలోని అసమానతలు, వివక్షలు నిర్మూలించాల్సిన అవసరం ఉంది,” అని సీఎం తెలిపారు. కోఠిలోని మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరును పెట్టడం తమ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయంగా చెప్పారు. ఇది మహిళా శక్తిని గౌరవించడమే కాకుండా, సామాజిక న్యాయం పట్ల ఉన్న ప్రతిబద్ధతను సూచిస్తుంది అని వివరించారు.
Read Also: ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయకపోతే కలిగే నష్టాలివే!
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం ద్వారా కార్పొరేట్ స్థాయిలో విద్య అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి మంచి పరిసరాలు, మౌలిక వసతులు అత్యంత కీలకమని, పాఠశాలలు, హాస్టళ్లు ఆ దిశగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేస్తూ, సీఎం రేవంత్ అన్నారు. “ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు చదువు అవసరం లేదని, కేవలం కులవృత్తులకే పరిమితం కావాలని భావించారు. దళితులు, బీసీలు గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ ఉండాలన్నట్టుగా మాజీ సీఎం పాలన సాగింది. ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన పాలన అది.”తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాల కలలతో ఎదిగిన యువత నిరాశకు గురయ్యారన్నారు. “మాజీ సీఎం తన ఇంట్లోనే ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఓడిన వారికి మరోచోట పదవులు ఇచ్చారు. కానీ పేదల బాగోగులు పట్టించుకోలేదు,” అని విమర్శలు గుప్పించారు.
ప్రస్తుతం ప్రభుత్వం 15 నెలల్లోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని వెల్లడించారు. అయినప్పటికీ లక్షల సంఖ్యలో యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, భర్తీ ప్రక్రియను ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. “వారి కుట్రలకు బలయ్యేలా చేయకూడదు. నిరుద్యోగ యువత కోసం న్యాయం జరగాలి. నోటికి వచ్చిన ముద్ద లాక్కున్నట్టుగా కేసులు వేస్తూ, తాము మాత్రం నిరంతరం ఉద్యోగాల భర్తీ చేసుకుంటున్నారు,” అని అన్నారు. విద్యార్థులకు ఏడాదలు గడుస్తున్నా ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదని, ఇది సమాజంలో అసమానతలే చూపిస్తున్నదని పేర్కొన్నారు. చివరగా, “సామాజిక రుగ్మతలను తొలగించాల్సిన బాధ్యత మనందరిదీ. న్యాయం, సమానత్వం మన లక్ష్యాలు కావాలి” అని ఆయన అన్నారు.
Read Also: KTR : ఎన్ని కుట్ర సిద్ధాంతాలు సృష్టించినా ఎప్పటికీ వాస్తవమే నిలుస్తుంది: కేటీఆర్