Jharkhand Assembly Elections : కేంద్ర హోంమంత్రి అమిత్ షా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు పాలము ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తామని అమిత్ షా అన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) సంకీర్ణ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయ సర్కారుగా మారిందని.. ఇకనైనా ప్రజలు వారిని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో చొరబాటుదారులను అరికట్టడం కేవలం మోడీ నాయకత్వంలోని బీజేపీ వల్లే సాధ్యమవుతుందని అమిత్ షా అన్నారు. రాహుల్ గాంధీ తన వెంట ఎప్పుడూ రాజ్యాంగాన్ని తీసుకెళ్లి, ప్రచారాల్లో దానిని చూపిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ నేత నకిలీ రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ దానిని అపహాస్యం చేస్తున్నారని అమిత్ షా దుయ్యబట్టారు. ఓబీసీ కోటాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహారాష్ట్రలోని కొన్ని వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని.. అయితే మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అనే విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలని అమిత్ షా అన్నారు.
రాష్ట్రంలో పెరుగుతున్న అక్రమ చొరబాటుదారుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది తమ పొలిటికల్ అజెండా అని సీఎం హేమంత్ సోరెన్ విమర్శిస్తున్నారని అన్నారు. సోరెన్ వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇక జమ్మూకశ్మీర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమేనని అమిత్ షా తెలిపారు. ఎన్ని తరాలు వచ్చి అడిగినా ఆర్టికల్ 370 ని పునరుద్ధరించే అవకాశం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు.