China: తైవాన్ అంశం పూర్తిగా చైనా అంతర్గత వ్యవహారమని, ఈ విషయంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ తేల్చిచెప్పారు. అమెరికా తైవాన్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ, ఈ విషయంలో చైనాపై విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. తైవాన్‌ను చైనా భాగంగానే పరిగణించాలని, వాస్తవ పరిస్థితులను గౌరవించాలంటూ అమెరికాకు ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల సింగపూర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో పాల్గొన్న అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. చైనా తైవాన్‌పై దూకుడుగా వ్యవహరిస్తోందని, తైవాన్ చుట్టూ యుద్ధ నౌకలను మోహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని హెగ్సెత్ ఆరోపించారు.
Read Also: Jyoti Malhotra : జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనపై రాజకీయ దుమారం
అంతేకాకుండా, భౌగోళిక, సముద్ర సంబంధిత వివాదాల్లో చైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని కూడా ఆయన విమర్శించారు.హెగ్సెత్ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ఘాటుగా స్పందిస్తూ, అమెరికా “నిప్పుతో చెలగాటం ఆడకూడదు” అని హెచ్చరించారు. చైనా సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతకు భంగం కలిగేలా ఇతర దేశాలు ప్రవర్తిస్తే తగిన ప్రతిచర్యలు తీసుకోనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తరణ వాద ధోరణిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో అమెరికా తన మిత్రదేశాలకు మద్దతు ఇస్తోందని హెగ్సెత్ అన్నారు. చైనా ఆర్థిక, సైనిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని ఆయన సూచించారు.
అయితే ఇది చైనాకు ఇష్టమైన ప్రకటన కాదు. దీనిపై స్పందించిన లిన్ జియాన్, అమెరికా తన వాస్తవ పరిధిని మరిచి మాట్లాడుతోందని ఆరోపించారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం విదేశీ జోక్యం కాకుండా, చైనా–తైవాన్ వ్యవహారాలను చైనా తానే పరిష్కరించుకుంటుందని స్పష్టం చేశారు. తైవాన్ విషయంలో అమెరికా మితిమీరిన వ్యాఖ్యలు చేయడం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చైనా హెచ్చరించింది. చైనా సంప్రదాయ విధానాన్ని నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తుందని, తైవాన్ పట్ల ఎలాంటి విభజనాత్మక చర్యలూ సహించబోమని బీజింగ్ స్పష్టం చేసింది.