Site icon HashtagU Telugu

Israel : ఇజ్రాయెల్‌లోని మెడికల్‌ సెంటర్‌పై ఇరాన్‌ క్షిపణి దాడి..తీవ్ర ఉద్రిక్తతలు !

Iranian missile attack on medical center in Israel...extreme tensions!

Iranian missile attack on medical center in Israel...extreme tensions!

Israel :  ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ తాజాగా జరిపిన భారీ క్షిపణుల దాడిలో బీర్‌షెవాలోని ప్రసిద్ధి చెందిన సొరొక మెడికల్‌ సెంటర్‌ తీవ్రంగా దెబ్బతిన్నది. డజన్ల కొద్దీ బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన ఇరాన్‌ ఈ దాడిలో పౌర నివాసాలు, కార్యాలయాలతోపాటు ఈ ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. ఆస్పత్రి ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దాడిలో ఆస్పత్రి భవనానికి భారీ నష్టం వాటిల్లింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిపై దాడి నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి ఎవ్వరూ రాకూడదని, ఇతర ఆస్పత్రులకు వెళ్లాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఇది ఇజ్రాయెల్‌లో అత్యంత రద్దీగా ఉండే మెడికల్‌ సెంటర్లలో ఒకటి. అయితే అదృష్టవశాత్తూ నిన్నటితో పోలిస్తే ఈ రోజు దాడికి గురైన అంతస్తును ముందుగానే ఖాళీ చేయించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంబులెన్స్‌ సర్వీసు చీఫ్‌ ఎలిబెన్‌ తెలిపారు. ముందుగానే తీసుకున్న జాగ్రత్తల వలన అనేక మంది ప్రాణాలు రక్షించగలిగామని ఆయన పేర్కొన్నారు.

Read Also: Election Commission of India : ఓటర్ ఐడీ కార్డుల జారీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులలో చాలావరకు సరిహద్దు ప్రాంతాల్లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం, ఆస్పత్రులను కూడా ఉపేక్షించకపోవడం విమర్శలకు తావిస్తోంది. హోం ఫ్రంట్‌ కమాండ్‌ సిబ్బంది దాడి జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించగా, గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిపై స్పందించిన ఇజ్రాయెల్‌ ఆరోగ్య శాఖ మంత్రి ఉరియల్‌ బుసో ఇది ఒక యుద్ధ నేరం. ఇరాన్‌ పాలకులు అమాయక పౌరులను, వైద్య సిబ్బందిని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఇది మానవతా విలువలకు వ్యతిరేకం. ఆరోగ్య శాఖ ఇటువంటి అనూహ్య ఘటనలకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. తక్షణమే స్పందించిన వైద్య, రెస్క్యూ బృందాలకు నా కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, దాడిలో ఉపయోగించిన క్షిపణులన్నీ అధిక సామర్థ్యాన్ని కలిగినవే. ఇవి సామాన్య నివాసాలతోపాటు, ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పడటం వల్ల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు, భవిష్యత్తులో ఇలాంటి దాడులకు సమర్థంగా ఎదుర్కొనే విధంగా జాతీయ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి ఆవరణాన్ని సైనిక బలగాలు ముట్టడి చేస్తూ, మిగతా బాధితులను రక్షించే చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ దాడి మరెన్నో మానవీయ ప్రశ్నలను తీసుకురావడంతోపాటు, యుద్ధం దెబ్బతీసే నిష్కలంక రంగాల్లో ఒకటైన ఆరోగ్య రంగంపై జరిగిన దాడిగా చరిత్రలో నమోదయ్యే అవకాశముంది.

Read Also: OG Business : మతిపోగొడుతున్న పవన్ కళ్యాణ్ ‘OG’ ప్రీ రిలీజ్ బిజినెస్