Site icon HashtagU Telugu

Intel Job Cuts:”ఇంటెల్”లో త్వరలో భారీగా ఉద్యోగ కోతలు!!

Intel Layoffs

Intel Layoffs

ఐటీ రంగంలో నెలకొన్న సంక్షోభం.. కంప్యూటర్ చిప్‌ల రంగానికి కూడా పాకుతోంది. చిప్ తయారీలో దిగ్గజ సంస్థగా ఉన్న ఇంటెల్ కార్ప్(Intel Corp) వేలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేసేలా కనిపిస్తోంది. తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకోవాలని ఇంటెల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. పర్సనల్ కంప్యూటర్ మార్కెట్లో ప్రస్తుతం మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇంటెల్ కార్ప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్లూమ్‌బర్గ్ న్యూస్ ఒక వార్త కథనం పబ్లిష్ చేసింది. ఈ నెలలోనే ఇంటెల్ కంపెనీ ఉద్యోగ కోతలను ప్రకటిస్తుందని బ్లూమ్‌బర్గ్ న్యూస్ తెలిపింది.

అక్టోబర్ 27న ప్రకటన ?

ఇంటెల్ కంపెనీ తన మూడో త్రైమాసిక ఆదాయ నివేదిక సమావేశం అక్టోబర్ 27న నిర్వహించనుంది. ఆ సమయంలోనే ఉద్యోగాల కోతలను ప్రకటించే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఇంటెల్ కార్ప్‌లోని సేల్స్, మార్కెటింగ్ విభాగాలలో ఉద్యోగాల కోత ఉండనుందని వెల్లడించింది. మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మందిని ఈ కంపెనీ తీసేస్తున్నట్టు తెలిపింది. జూలై నెల నాటికి ఇంటెల్ కార్ప్‌లో 1,13,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈవిషయంలో స్పందించేందుకు ఇంటెల్ నిరాకరించింది.

మొబైల్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ షేర్ల అమ్మకం..

ఇంటెల్ తన ఆదాయాన్ని మెరుగు పరచుకోవడానికి మొబైల్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ వ్యాపారం యొక్క షేర్లను ఐపీఓ ( ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌)లో విక్రయించే ప్రణాళికలను కూడా పరిశీలిస్తోంది. జూలై నెలలో ఇంటెల్ కంపెనీ వార్షిక అమ్మకాలు తగ్గాయి. రెండో క్వార్టర్ ఫలితాల ప్రకటనలో అంచనాలను అందుకోలేక పోయింది.దీంతో లాభాలపై అంచనాలను కూడా ఈ కంపెనీ తగ్గించేసుకుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కూడా భారీగా పెరిగింది. ఈ సమయంలో ప్రజలు ఏదైనా వస్తువును కొనేందుకు వెనుకాడుతున్నారు. దీంతో కంప్యూటర్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. ఈ అమ్మకాలు తగ్గిపోవడంతో కంపెనీ వ్యాపారాలు దెబ్బతిన్నాయి.ప్రధాన పీసీ మార్కెట్లలో కరోనా ఆంక్షలతో చిప్ తయారీ కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో పాటు రష్యా-ఉక్రెయిన్ సరఫరా సమస్యలు చిప్‌ల డిమాండ్‌ను దెబ్బకొట్టాయి. ఈ సమస్యలన్ని వెరసి ఉద్యోగులపై పడుతున్నాయి.

Exit mobile version