RJ Surya : చీకటి నుండి వెలుగువైపు ప్రయాణం.. ఆర్.జె సూర్య జీవితం..

ఎప్పుడూ నవ్వుతూ చుట్టూ ఉన్న వారిని నవ్వించే చాలా మంది వ్యక్తుల జీవితాల వెనుక కదిలించే కధలెన్నో ఉంటాయి

  • Written By:
  • Updated On - January 23, 2022 / 11:44 AM IST

ఎప్పుడూ నవ్వుతూ చుట్టూ ఉన్న వారిని నవ్వించే చాలా మంది వ్యక్తుల జీవితాల వెనుక కదిలించే కధలెన్నో ఉంటాయి. కొన్ని కధలు కన్నీళ్లు తెప్పిస్తాయి… కొన్ని కధలు స్ఫూర్తిని నింపుతాయి… మరికొన్ని కధలు ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోతాయి. జీవితంలో ఉన్నతంగా ఎదిగిన వ్యక్తుల యొక్క విజయాలు అందరికీ తెలుస్తాయి కానీ ఆ స్థాయికి వారు చేరుకునే ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలు ఎవరికీ తెలియవు. వాస్తవానికి కష్టం రుచి చూసిన వారికే విజయం పొందాలనే కసి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో ఆర్.జె.సూర్య ఒకడు అని చెప్పవచ్చు.93.5 రెడ్ ఎఫ్ఎంలో డైరెక్టర్ ఏ.వి.రావు ప్రోగ్రామ్ విన్నవారెవరికైనా ముఖంపై చిరునవ్వు రాకుండా ఉండదేమో. అంత విచిత్రంగా, వెటకారంగా ఉంటాయి ఆ వాయిస్ లు. అయితే వాటిని మిమిక్రీ చేసేది ఈ ఆర్ జె సూర్యనే అని చాలా మందికి తెలీదు. ఇంతే కాదు సూర్య గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అతని కధ విన్న వారెవరైనా స్టైలిష్ గా కనిపించే ఈ కుర్రాడి జీవితంలో ఇన్ని కష్టాలు, ఇంత విషాదం ఉందా అని ఆశ్చర్యపోతారు.

తూర్పు గోదావరి జిల్లా మమ్మిడివరం దగ్గర్లో పశువుల్లంక అతని గ్రామం. 1996లో వచ్చిన తుఫానులో ఆ గ్రామం తుడిచిపెట్టుకుపోతుంది. దాంతో అప్పుడే పుట్టిన తన తమ్ముడితో కలిసి సూర్య కుటుంబం భీమవరంకు తరలివెళ్తుంది. అక్కడ బంధువుల సహాయంతో ఒక చిన్న గదిలో నివాసం ఏర్పరచుకుంటారు. కటిక పేదరికం మధ్య తండ్రి కూలి పనుల ద్వారా వచ్చే ఆదాయంపైనే కుటుంబం నడిచేది. తృప్తిగా ఒక పూట భోజనం చేసేందుకు కూడా ఇబ్బంది పడేవారంటే ఆ పరిస్థితిని మీరే అర్ధం చేసుకోవచ్చు. సూర్యను ఎలిమెంటరీ విద్య చదివించేందుకు కూడా పుస్తకాలు కొనివ్వలేని పరిస్థితి తండ్రిది. ఆ సమయంలో తల్లి ప్రోత్సాహంతో ఒక పూట బడిలో చేరి మరో పూట కిల్లీ కొట్టులో షోడాలు శుభ్రం చేసే పనికి కుదురుతాడు. అక్కడ వచ్చిన డబ్బులతోనే 10వ తరగతి వరకూ తన చదువుకు కావాల్సినవన్నీ సమకూర్చుకునేవాడు.
కుటుంబంలో ఆర్ధిక పరిస్థితులు ఏ మాత్రం బాగా లేని ఆ సమయంలోనే సూర్య తమ్ముడు జాండిస్ బారిన పడడంతో కిడ్నీ సమస్య ఏర్పడుతుంది. లక్షలు వెచ్చించి ఆపరేషన్ చేయించలేని పేదరికం ఆ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంటుంది. ఇది సూర్య జీవితంపై తీవ్ర ప్రభావం చూపిన తొలి సంఘటన.

ఇప్పుడు తనకెంతో పేరు తెచ్చి పెట్టిన మిమిక్రీ కళను సూర్య డిగ్రీ చదువుతున్న సమయంలోనే ప్రాక్టీస్ చేసేవాడు. వయసులో ఉన్న ప్రతి కుర్రాడూ ఏదో ఒక సమయంలో ప్రేమలో పడతారనే విషయం మీ అందరికీ తెలిసిందే. అలానే సూర్యకు కూడా పీజీ చదివే సమయంలో ఒక లవ్ స్టోరీ ఉండేది. నిజానికి ఈ లవ్ స్టోరీ వల్లే అతని జీవితం ఒక కొత్త మలుపు తిరిగిందని చెప్పవచ్చు. ఆరు నెలలు ప్రేమించిన అమ్మాయి కోసం సూర్య ఇంట్లో పెద్ద యుద్ధమే చేసి తల్లిదండ్రులను ఒప్పిస్తాడు. అంతేకాదు అమ్మాయి ఇంటికి తల్లిదండ్రులను తీసుకువెళ్లి మంచి ఉద్యోగం వచ్చిన తరువాత పెళ్లి చేసే విధంగా కూడా మాట్లాడిస్తాడు.

కొందరు అమ్మాయిలు అబ్బాయి తనతో ఉంటే చాలు కుటుంబం గురించి తనకు అనవసరం అనుకుంటారు. ఈ అమ్మాయి కూడా అదే కోవకు చెందింది. ఓ రోజు సూర్యతో నా జీవితంలో నువ్వు మాత్రమే ఉండాలి నీ తల్లిదండ్రులను వదిలి రా అనే కండిషన్ పెట్టిందట. అయితే తన ప్రేమను నిలబెట్టుకునేందుకు తల్లిదండ్రులతో యుద్ధం చేసి ఒప్పించిన సూర్య అదే ప్రేమ కోసం వారిని వదులుకోవాలంటే తట్టుకోలేకపోయాడు. ఆరు నెలల ప్రేమ కంటే కని పెంచిన తల్లిదండ్రుల ప్రేమకే విలువ ఇచ్చాడు. చిన్నతనంలో పుట్టిన గ్రామాన్ని కోల్పోయాడు, కటిక పేదరికాన్ని అనుభవించాడు, కష్టాలను చవి చూశాడు, తోడబుట్టిన తమ్ముడిని కోల్పోయాడు, చివరికి ఎంతో ప్రేమించిన అమ్మాయి ప్రేమను కూడా వదులుకున్నాడు.

ఇక కోల్పోవడం కాదు జీవితంలో సాధించడం ముఖ్యమని నిశ్చయించుకున్నాడు. చిన్నతనం నుండి కుటుంబాన్ని వేధిస్తున్న పేదరికాన్ని తరిమికొట్టాలని అనుకున్నాడు, తనను వదులుకున్న వారు తనను చేరుకోలేనంత ఎత్తుకు ఎదగాలని నిర్ణయించుకున్నాడు, కష్టపడి పైకి రావాలనే కసిని పెంచుకున్నాడు. తరువాత తనకు వచ్చిన ఒక్కో అవకాశాన్ని ఒడిసిపట్టుకుని అందరి అభినందనలు అందుకున్నాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కృషిని నమ్ముకుంటే కష్టాలు శాశ్వతం కాదని నిరూపించాడు. రెడ్ ఎఫ్ఎంలో ఆర్ జె గా కెరీర్ ను ప్రారంభించి ఒక్కో మెట్టు ఎక్కుతూ… ఎదుగుతూ సూర్య సాగిస్తున్న ప్రస్థానం ఎందరో యువతకు నేడు స్ఫూర్తిదాయకం.