Weekly 47 Hours : ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్వో) మన భారతీయులకు సంబంధించి ఒక ఆసక్తికర నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా కష్టపడి పనిచేసే వాళ్లలో ఇండియన్సే ఎక్కువగా ఉన్నారని ఆ రిపోర్టులో తేల్చి చెప్పింది. ఈ సంవత్సరానికి సంబంధించిన తాజా (2023) లెక్కల ప్రకారం.. అంతర్జాతీయంగా భారతీయులు వారానికి సగటున 47.7 గంటలు పని చేస్తున్నారని ఐఎల్వో తెలిపింది. ప్రతివారం అత్యుత్తమ పనిగంటల (యావరేజ్ వర్క్ వీక్) విషయంలో ఖతార్, కాంగో, లెసోతో, భూటాన్, గాంబియా, యూఏఈ, భారత్ ముందంజలో ఉన్నాయని పేర్కొంది. ఈవిషయంలో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో 7వ స్థానంలో ఉందని చెప్పింది. ప్రపంచంలోనే 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా పేరొందిన అమెరికా, చైనా, జపాన్‌ల కంటే భారత్‌లోనే ఉద్యోగులు ఎక్కువ గంటలు పని చేస్తున్నారని నివేదికలో వెల్లడైంది. అత్యధిక తలసరి ఆదాయం ఉన్న దేశాల్లో ఉద్యోగులకు తక్కువ పని గంటలు అమల్లో ఉన్నట్లు ఐఎల్వో డేటా చెబుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
సగటున అత్యధిక పని గంటలు ఉన్న భారత్.. ప్రపంచ తొలి 10 ఆర్థిక వ్యవస్థల్లో అత్యల్ప తలసరి జీడీపీని కలిగి ఉంది. అదే ఫ్రాన్స్‌లో వారానికి 30 పని గంటల విధానం అమల్లో ఉంది. ఫ్రాన్స్‌లో అత్యధికంగా రూ.46 లక్షల తలసరి ఆదాయం ఉంది. వారానికి పనిగంటలు సాధ్యమైనంత మేర తక్కువగా ఉండటం వల్ల ఉద్యోగులకు పనితో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపైనా దృష్టి పెట్టేందుకు సమయం మిగులుతోందని పరిశీలకులు అంటున్నారు. నిజానికి వర్కింగ్ అవర్స్ గురించి చర్చ జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ బాంబే షేవింగ్ కంపెనీ సీఈవో శంతను దేశ్‌పాండే రోజుకి కనీసం 18 గంటలు పని చేయాలని అన్నారు. అయితే లింక్డిన్‌లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాల్సి (Weekly 47 Hours) వచ్చింది.