Site icon HashtagU Telugu

Railways engineering marvel: తమిళనాడులోని లిప్ట్ ద్వారా పైకి లేచే వంతెన.. లేటెస్ట్ టెక్నాలజీతో పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం

Pambam Bridge

Pambam Bridge

మన దేశంలో ఎక్కువమందిని ఆకర్షించే సీ బ్రిడ్జ్ లు ఏమైనా ఉన్నాయా అంటే.. అది తమిళనాడులోని పంబన్ బ్రిడ్జే అని చెప్పాలి. దాని టెక్నాలజీ అలాంటిది. కానీ దానిని కట్టి అప్పుడే 108 సంవత్సరాలు అయిపోయింది. దీంతో దాని పనితీరు మందగిస్తోంది. అందుకే దాని పక్కన ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో మరో బ్రిడ్జ్ ను కడుతోంది రైల్వేశాఖ. అది కూడా రెండు మార్గాలు ఉండేటట్లుగా దానిని నిర్మిస్తోంది. మరో ఏడాదిలో దీని పనులు కూడా పూర్తవ్వబోతున్నాయి.

ఈ పంబన్ బ్రిడ్జ్ ని 1914లో సముద్రంలో నిర్మించారు. రామనాథపురం జిల్లాలో ఉన్న మండపాన్ని, రామేశ్వర ద్వీపాన్ని ఇది కలుపుతుంది. ఈ వంతెన పొడవు 2.06 కి.మి. అప్పట్లో దీని నిర్మాణానికి రూ.20 లక్షలు ఖర్చయ్యింది. 2006-07 లో ఈ వంతెనను మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ కు మార్చేశారు. ఈ వంతెనకు ఉన్న ప్రత్యేక ఏంటంటే.. ఈ బ్రిడ్జ్ మధ్యనుంచి పడవలు వెళ్లాలంటే.. ఈ వంతెనను మధ్యలో నుంచి తెరవాల్సి ఉంటుంది. దీనికోసం 16 మంది సిబ్బంది పనిచేయాల్సి వస్తోంది.

ఇలా 16 మంది కలిస్తేనే ఈ వంతెనను రెండుగా చీల్చి పడవలకు వెళ్లడానికి దారి దొరుకుతుంది. కాని దీనివల్ల ఇబ్బంది ఎక్కువవుతోంది. అందుకే ఈసారి లేటెస్ట్ టెక్నాలజీతో దీనిని నిర్మించారు. రైల్వే ట్రాక్ ఉన్న వంతెన.. నౌకలు వచ్చినప్పుడు లిప్ట్ ద్వారా పైకి లేస్తుంది. ఇదంతా ఆటోమేటిగ్గా జరుగుతుంది. పెద్ద షిప్ లు, క్రూయిజ్ లు కూడా ఈజీగా వెళ్లిపోయేలా దీనిని నిర్మిస్తున్నారు. పైగా ఈ ప్రాంతంలో ఎప్పుడూ గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయి. అంటే మనిషి స్థిరంగా నిలబడడం కూడా కష్టమవుతుంది. పైగా ఇక్కడ సముద్రం ఉధృతి కూడా ఎక్కువ. అందుకే ఇలాంటి పరిస్థితులను కూడా తట్టుకునేలా దీనిని డిజైన్ చేశారు.

వంతెనపై ప్రస్తుతం ఒక ట్రాక్ ని మాత్రమే నిర్మిస్తు్న్నారు. కానీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డబ్లింగ్ పనులు కూడా చేపట్టడానికి వీలుగా రెండు ట్రాక్ లకు అవసరమైన స్థలాన్ని బ్రిడ్జిపై విడిచిపెట్టారు.