India-China : గత కొన్నేళ్లుగా సరిహద్దుల్లో భారత్ చైనా మధ్య కొనసాగుతున్న వివాదం పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. రెండు దేశాలు.. సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించగా.. వెనక్కి తీసుకునేందుకు భారత్, చైనా ఒక ఒప్పందానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. అదే సమయంలో వాస్తవాధీన రేఖ – ఎల్ఏసీ వెంట పెట్రోలింగ్‌ను మళ్లీ ప్రారంభించేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ వెల్లడించారు.
16వ బ్రిక్స్ సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ కీలక ముందడుగు పడడం గమనార్హం. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోనూ రష్యాలో మోడీ చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్‌పై ఒప్పందం కుదిరిందని అన్నారు. ఎన్నో వారాలుగా చర్చలు జరుగుతున్నాయని, దీంతో ఈ ఒప్పందం జరిగిందని చెప్పారు. ఈ ఒప్పందం బలగాల ఉపసంహరణతో పాటు 2020లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
కాగా, ఈ నెల 22, 23న రష్యాలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో జరగనుంది. గల్వాన్ లోయలో 2020లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. అనంతరం భారత్, చైనా అక్కడ భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి.