Site icon HashtagU Telugu

Skating In Saree: మలయాళీల రూటే వేరు! కేరళలో చీరకట్టుతో స్కేటింగ్

Skating In Saree

Skating In Saree

చీర కట్టుకుంటే బాగుంటుంది. కాని.. దాంతో పని చేయడం కష్టమబ్బా! అని చాలా మంది ఈ తరం అమ్మాయిలు అంటుంటారు. కానీ కొందరు మహిళలు మాత్రం.. చీరకట్టుతోనే అద్భుతాలు చేస్తున్నారు. రకరకాల విన్యాసాలతో పాటు యుద్ధ విద్యలను కూడా ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు అలాంటి కోవలోకే చేరుతోంది.. లారిసా. ఆమె చీర కట్టుకుని కేరళ రోడ్లపై చేసిన స్కేటింగ్.. ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చేస్తోంది.

లారిసాకు ప్రయాణాలు చేయడమంటే చాలా సరదా. అందుకే అలాంటి ఎక్స్ పీరియన్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇప్పటికే చాలా విన్యాసాలు చేసింది. అందుకే ఈసారి డిఫరెంట్ గా ఆలోచించింది. మనవాళ్లను ఆకట్టుకునేలా ఏదైనా చేయాలని భావించింది. అప్పుడు వచ్చిందే ఈ స్కేటింగ్ ఐడియా. కాకపోతే చీరకట్టుకుని చేస్తేనే అది డిఫరెంట్ గా ఉంటుందని అనుకుంది.

ఐడియా వచ్చిందే తడవు.. అమ్మడు ఆచరణలో పెట్టేసింది. కాకపోతే చీర కట్టుకుని స్కేటింగ్ చేయడం.. అనుకున్నంత సులభమేమీ కాదు. ఎందుకంటే బాడీ మొత్తం చీరతో కవర్ అయి ఉంటుంది. అలాంటప్పుడు స్కేటింగ్ చేస్తూ శరీరాన్ని బ్యాలెన్స్ చేయడమంటే మాటలు కాదు. కానీ అక్కడున్నది లారీసా కదా. అందుకే చీరకట్టులోనే స్కేటింగ్ చేసింది. దానిని కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

లారిసా తాను అనుకున్నది చేసింది. అలా చీరకట్టులో స్కేటింగ్ చేస్తున్నప్పుడు చాలా ఫన్ గా అనిపించిందట. పైగా ఆమె వెళుతున్న దారిలో చాలామంది ఆమెతో సెల్ఫీలు కూడా దిగారట. మొత్తానికి ఆమె విన్యాసానికి నెటిజన్లంతా ఫిదా అయిపోయారు. అందుకే ఉచిత సలహాలు కూడా ఇచ్చేశారు. పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్కెటింగ్ చేయచ్చు కదా అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మరొకరేమో.. అలా ఊరికే స్కేటింగ్ చేసే బదులు.. పర్యావరణం మీద అవగాహన కల్పిస్తూ చేయచ్చు కదా.. జనాలు కూడా స్ఫూర్తి పొందుతారని కామెంట్ చేశారు. మొత్తానికి లారిసా చేసిన ప్రయోగం.. అందరినీ ఆకట్టుకుంటోంది.. ఆకర్షిస్తోంది.