Global Warming : ధృవ ప్రాంతాల్లో క‌రుగుతున్న మంచు దేనికి చిహ్నం..?

 భూమి మీద‌ రుతువులు తిర‌గ‌బ‌డుతున్నాయి. ఒకే స‌మ‌యంలో ఒక ప్రాంతంలో మండుతున్న ఎండ‌లు, మ‌రో ప్రాంతంలో ఊళ్ళ‌ను ముంచెత్తుతున్న వ‌ర్షాలు. ధృవాల్లో మంచు కరుగుతోంది. స‌ముద్ర మ‌ట్టాలు పెరుగుతున్నాయి.

  • Written By:
  • Updated On - January 19, 2022 / 08:36 PM IST

భూమి మీద‌ రుతువులు తిర‌గ‌బ‌డుతున్నాయి. ఒకే స‌మ‌యంలో ఒక ప్రాంతంలో మండుతున్న ఎండ‌లు, మ‌రో ప్రాంతంలో ఊళ్ళ‌ను ముంచెత్తుతున్న వ‌ర్షాలు. ధృవాల్లో మంచు కరుగుతోంది. స‌ముద్ర మ‌ట్టాలు పెరుగుతున్నాయి. స‌ముద్ర తీర న‌గ‌రాల‌కు ముప్పు ముంచుకువ‌స్తోంది. మొత్తం మీద మాన‌వ జాతి మ‌నుగ‌డే ప్ర‌మాద‌పుటంచుల‌కు చేరుతోంది. దీనికి కార‌ణం ఎవ‌రు? మ‌నిషి త‌న సుఖాల కోసం వాడుతున్న వ‌స్తువులే భూమిని వేడెక్కిస్తున్నాయి. ప‌ర్యావ‌ర‌ణంలో వేడిని త‌గ్గించేందుకు ప్ర‌పంచ దేశాలు ఎప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటూనే ఉన్నాయి. కాని ఉత్త‌ర ధృవాలు వేడెక్కుతున్నాయి. అక్క‌డి మంచు ప‌ల‌క‌లు, మంచు కొండ‌లు క్ర‌మంగా క‌రిగిపోతున్నాయి. ఇప్ప‌టికే అనేక మంచు ప‌ర్వ‌తాలు స‌ముద్రంలో క‌లిసిపోయాయి. వాతావ‌ర‌ణ‌లో వ‌స్తున్న మార్పులు భూ గోళానికి ముంచుకొస్తున్న ముప్పును సూచిస్తున్నాయ‌ని గ్రీన్ ల్యాండ్ లో మంచు ప‌ల‌క‌ల‌పై ప‌రిశోధ‌నలు జ‌రుపుతున్న ట్విలా మూన్ చెప్పారు.

Also Read : బ్రిటిషర్లను ఎదురించి పోరాడిన టిప్పు సుల్తాన్ ఆస్థాన నర్తకి

మీథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయివులు పెరగ‌డం వ‌ల్ల ఆర్కిటిక్ ప్రాంతంలోని మంచు ప‌ల‌క‌లు, మంచు కొండ‌లు స‌ముద్ర గ‌ర్భంలో క‌ల‌సిపోతున్నాయి. సైబీరియా వంటి ధృవ ప్రాంతాల్లో అడ‌వుల్లో కార్చిచ్చు రగిలి పెద్ద ఎత్తున న‌ష్టం సంభ‌విస్తోంది. చివ‌రి మంచు ప్రాంతం అయిన ఆర్కిటిక్ ప్రాంతం ఈ ఏడాది అనుకోని విధంగా మంచు క‌రిగే ప‌రిస్థితి ఎదుర్కొంది. రానున్న రెండు ద‌శాబ్దాల్లో ఆర్కిటిక్ ప్రాంతంలో వేస‌వి కాలంలో మంచును చూడ‌టం సాధ్యం కాక‌పోవ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ధృవ ప్రాంతాల్లో ఎంత మంచును మిగుల్చుతున్నాం, ఎంత పోగొట్టుకుంటున్నాం, ఎంత త్వ‌ర‌గా పోగొట్టుకుంటున్నామ‌నేది మ‌నం సృష్టించుకునే బొగ్గుపులుసు వాయువుల మీదే ఆధార‌ప‌డి ఉంద‌ని అమెరికాలోని స్నో అండ్ ఐస్ డేటా సెంట‌ర్ శాస్త్రవేత్త అయిన మూన్ వివ‌రించారు. ప్ర‌పంచ దేశాలు తీసుకునే నిర్ణ‌యాల మీదే భూగోళం భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది. ఆర్కిటిక్ ప్రాంతంలో సంభ‌వించే ప‌రిణామాలు ఆ ప్రాంతానికే ప‌రిమితం కావు. ప్ర‌పంచం న‌లుమూల‌లా సంభ‌విస్తున్న ప్ర‌కృతి విప‌త్తుల‌కు కార‌ణం విప‌రీతంగా పెరిగిపోతున్న భూతాప‌మేన‌ని శాస్త్రవేత్త‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. భూమి వేడెక్క‌డం వ‌ల్ల జ‌రుగుతున్న న‌ష్టాల‌ను ఇప్ప‌టికే ప్ర‌పంచ మాన‌వాళి అనుభ‌విస్తోంద‌ని గుర్తు చేస్తున్నారు. ఒక‌సారి మంచు క‌ర‌గ‌డం మొద‌లైందంటే, అది మ‌రింత‌గా క‌రుగుతూనే ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ధృవ ప్రాంతాలు మంచుతో క‌ప్పి ఉంటే సూర్య‌కాంతి దానిపై ప‌డి తిరిగి వాతావ‌ర‌ణంలోకి వెళుతుంది. అదే మంచు క‌రిగి నీరు మాత్ర‌మే మిగిలిఉంటే అది ఎక్కువ వేడిని త‌న‌లో ఇముడ్చుకుంటుంది.

Also Read : 200 ఏళ్లుగా మృదంగాలే వారికి జీవ‌నాధారం

1971 నుంచి 2019 మ‌ధ్య కాలంలో ఇత‌ర భూగోళం కంటే ఆర్కిటిక్ ప్రాంతం మూడు రెట్లు ఎక్కువ వేగంగా వేడెక్కుతోందని ఆర్కిటిక్ మానిట‌రింగ్ అండ్ అసెస్మెంట్ ప్రోగ్రాం సంస్థ వెల్లడించింది. ఆర్కిటిక్ ప్రాంతం వేడెక్కితే దాని ప్ర‌భావం ధృవ ప్రాంత దేశాల్లో నివ‌సించే ప్ర‌జ‌ల మీద మాత్ర‌మే ఉండ‌దు. ప‌శ్చిమ ప్రాంతం నుంచి తూర్పు వైపుగా వీచే గాలుల వ‌ల్ల వాతావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌లు మారిపోతాయి. దీనివ‌ల్ల తీవ్ర‌మైన మార్పులు సంభ‌వించి విప‌రీత‌మైన వ‌ర‌ద‌లు, క‌రువులు సంభ‌విస్తాయ‌ని, అప‌రిమిత‌మైన వేడిగాలుల వ‌ల్ల అడ‌వుల్లో కార్చిచ్చులు ర‌గులుతాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ధృవాల్లో మంచు క‌ర‌గ‌డం వ‌ల్ల స‌ముద్ర‌మ‌ట్టాలు పెరుగుతాయి. త‌ద్వారా తీర ప్రాంతాలు స‌ముద్రంలో క‌లిసిపోయే ప్రమాదం పెరుగుతుంది.