Kavitha : తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన రాజకీయ స్థానం గురించి స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదు. ఇదే నా పార్టీ. కొత్త పార్టీ పెడతానంటూ ఎక్కడా చెప్పలేదు. అలాంటి ఆలోచన ఉంటే డంకా బజాయించి చెప్తాను అని ఆమె వ్యాఖ్యానించారు. మళ్లీ తన తండ్రి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. గతంలో జాగృతి సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, కేసీఆర్ సూచనలతో కొన్ని యాక్టివిటీస్ తగ్గించాల్సి వచ్చిందని అన్నారు. కానీ ఇప్పుడు అలా తగ్గించేది లేదని, వచ్చే ఎన్నికల తర్వాత కూడా జాగృతిని ఉద్యమాత్మకంగా బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జాగృతిని పునరుద్ధరిస్తామన్నారు.
పార్టీ అంతర్గత సంఘర్షణపై వ్యాఖ్యలు
2006లో రాజకీయాల్లోకి వచ్చాను. అనేక ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఈ నెల రోజులుగా వస్తున్న హెడ్‌లైన్స్ ఊహించలేదు అంటూ కవిత బాధాభరితంగా స్పందించారు. తాను చిన్నప్పటి నుంచీ కేసీఆర్‌కు లేఖలు రాస్తూ వచ్చానని, ఇటీవల రాసిన లేఖ ఒకదాని లీక్ కావడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని తెలిపారు. పార్టీలో కొంతమంది కోవర్టులు పనిచేస్తున్నారని, వాళ్ల వల్లే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆమె ఆరోపించారు. వాళ్లను బయటకు పంపకపోతే పార్టీ మనుగడకే ప్రమాదమవుతుంది అన్నారు. పార్టీకి చెందిన కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని కూడా పేర్కొన్నారు.
పదేళ్ల ఆవేదన-రాజకీయ కలలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నానని, పదకొండు సంవత్సరాలుగా ఆవేదనలో ఉన్నానని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ వేడుకలు నిర్వహించడానికి కూడా ప్రోటోకాల్ పేరుతో అడ్డంకులు పెట్టారు. జిల్లాకే పరిమితం కావాల్సి వచ్చింది అని వివరించారు. తనపై ఈడీ కేసు నమోదైనప్పటి నుంచే పార్టీకి విజ్ఞప్తి చేస్తూ వచ్చానని, కానీ ఎలాంటి స్పందన లేకపోయిందని, జైలుకు వెళ్తున్నప్పుడు కూడా పార్టీ తనకు మద్దతు ఇవ్వలేదని ఆమె వాపోయారు. ఇటీవల తనపై పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని స్పష్టమైన హెచ్చరికలూ వచ్చాయని తెలిపారు.
రాజకీయ లక్ష్యం –సీఎంగా మారాలన్న ఆశయం
ప్రతి ఒక్కరికీ ఎదగాలన్న కోరిక ఉంటుంది. నాకు సైతం ముఖ్యమంత్రిగా మారాలన్న ఆశ ఉంది. అది పదేళ్లయినా, ఇరవై ఏళ్లయినా సాధిస్తా అని ధైర్యంగా పేర్కొన్నారు. ఎంపీగా పని చేసినప్పుడు ఢిల్లీలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయని, నిజామాబాద్ ఎంపీగా ఓడిన తర్వాత కూడా మళ్లీ పోటీ చేయాలనుకున్నానని, అయితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
బీజేపీపై తీవ్ర విమర్శలు
కేంద్రంలో బీజేపీ పాలనలో ఈడీని ఆయుధంగా మార్చి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని అన్నారు. తాను లిక్కర్ కేసులో ఆరోపణలకు గురై ఆరు నెలల పాటు జైల్లో ఉన్నానని, బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలన్న ఒత్తిడి కూడా ఎదురైనట్లు తెలిపారు. ఆ ఒత్తిడికి ఒప్పుకున్నా ఉంటే బీఆర్ఎస్ ఉండేది కాదు. 75 లక్షల కార్యకర్తల ఆశలు నీరుగారిపోతాయి అన్నారు.
కుటుంబ విభేదాలపై స్పష్టత
తనకు అన్న రామన్న (కేటీఆర్)తో విభేదాలు లేవని, ఇద్దరం ఫ్రెండ్లీగా ఉంటామని స్పష్టం చేశారు. అయితే తన లేఖ లీక్ అయిన తరువాత కొంత రాజకీయ దూరం ఏర్పడిందని చెప్పారు. ఫ్యామిలీ పరంగా ఏ విభేదాలు లేవు. ఆ విషయంతో రామన్న సైతం సంతోషంగా లేరు అని అన్నారు. తండ్రి కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళ్తున్న సమయంలో తాను కలవలేదన్న వార్తలు అసత్యమని ఖండించారు. పైకి వెళ్లి నాన్నను విష్ చేశాను. ఆ తర్వాత అమ్మతో టిఫిన్ చేశాను. నా భర్త అనిల్ కూడా కేసీఆర్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేశారు అని వివరించారు. ఇవన్నీ తప్పుడు ప్రచారమేనని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు
నాకు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అనిపించలేదు. కానీ నా పీఏ స్థాయి వ్యక్తులకు సిట్ నుంచి కాల్స్ వచ్చాయి. వాళ్లకు నేనే విచారణకు వెళ్లమని చెప్పాను. మళ్లీ వారికి ఏ నోటీసు రాలేదు అని వివరించారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే ఈ వ్యవహారాన్ని రాజకీయంగా మలచాలని చూస్తోందని ఆరోపించారు. నాకు ఒక్క నాయకుడు.. ఆయన కేసీఆర్. పార్టీకి కట్టుబడి ఉన్నాను. కొత్త పార్టీ అనే మాటే లేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. జాగృతి బలోపేతం చేస్తాను అని కవిత అన్నారు.
Read Also: Nara Lokesh : వైఎస్సార్ కాంగ్రెస్ కుట్రలు విఫలం.. మెగా డీఎస్సీ విజయవంతం